Begin typing your search above and press return to search.

శివ‌సేన అంతం.. అంతా ఒక్క నెల‌లోనే!

By:  Tupaki Desk   |   20 July 2022 4:30 PM GMT
శివ‌సేన అంతం.. అంతా ఒక్క నెల‌లోనే!
X
జూన్ 19 నుంచి జూలై 19.. ఒక్క నెల రోజులు. ఈ ఒక్క నెల‌లోనే శివ‌సేన పార్టీ ఆ పార్టీ అధినేత‌ ఉద్ధ‌వ్ థాక‌రే ప‌ట్టు నుంచి జారిపోయింది. జూన్ 19న మ‌హారాష్ట్ర ఎగువ స‌భ‌కు జ‌రిగిన‌ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల త‌ర్వాత శివ‌సేన ప‌త‌నం మొద‌లైంది. ఆ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కొంత‌మంది శివ‌సేన ఎమ్మెల్యేలు.. బీజేపీ అభ్య‌ర్థికి క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో నాలుగు స్థానాలు గెల‌వ‌డానికే మాత్ర‌మే బ‌లం ఉన్న బీజేపీ ఐదు ఎమ్మెల్సీ సీట్ల‌ను గెలుచుకుంది.

అంత‌టితో ఆగ‌ని నాటి శివ‌సేన మంత్రి ఏక‌నాథ్ షిండే దాదాపు 25 మంది ఎమ్మెల్యేల‌తో గుజ‌రాత్ లోని సూర‌త్ లో క్యాంపుకు వెళ్లిపోయారు. శివ‌సేన అధినేత ఉద్ధ‌వ్ థాక‌రే.. ఎన్సీపీ, కాంగ్రెస్ కూట‌మిని వ‌దిలిపెట్టి బీజేపీకి మద్ద‌తు ఇవ్వాల‌ని ఏక‌నాథ్ షిండే నేతృత్వంలోని రెబ‌ల్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దీనిపై ఉద్ధ‌వ్ ఏమీ స్పందించ‌లేదు.

అయితే శివ‌సేన కీల‌క నేత సంజ‌య్ రౌత్ మాత్రం ఇదంతా బీజేపీ ఆడిస్తున్న డ్రామా అని మండిప‌డ్డారు. రెబ‌ల్ ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. మ‌రోవైపు ఉద్ధ‌వ్.. రెబ‌ల్ నేత‌ల వ‌ద్ద‌కు ఇద్ద‌రు నేత‌ల‌ను రాజీ కోసం పంపారు. అయితే రెబ‌ల్ నేత‌లు.. ఉద్ధ‌వ్ బీజేపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తానే తాము తిరిగి శివ‌సేన గూటికి వ‌స్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఐదు రోజులు ఉన్న రెబ‌ల్ ఎమ్మెల్యేలు జూన్ 26న‌ అసోంలోని గువ‌హ‌టికి మ‌కాం మార్చారు. అదే స‌మ‌యంలో ఏక‌నాథ్ షిండే శిబిరంలో చేరే రెబ‌ల్ ఎమ్మెల్యేల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతూ పోయింది. మొద‌ట 22 మంది షిండే వెంట ఉండ‌గా ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూ 42కి చేరింది. మ‌రోవైపు ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా షిండే శిబిరంలో చేరారు.

మ‌రోవైపు శివ‌సేన వ్యూహాత్మ‌కంగా రెబ‌ల్ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు కార్య‌క‌ర్త‌ల‌తో ధ‌ర్నాలు చేయించింది. ప‌లుచోట్ల రెబ‌ల్ ఎమ్మెల్యేల ఆఫీసులపైన దాడులు చేయించింది. వారిని మ‌హారాష్ట్ర ద్రోహులుగా అభివ‌ర్ణించింది. దీంతో రాజీకి దారులు మూసుకుపోయాయి. అంతేకాకుండా శివ‌సేన అధినేత, ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక‌రే.. డిప్యూటీ స్పీక‌ర్ తో 19 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయించారు. దీంతో వారంతా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

మ‌రోవైపు బీజేపీ నేత‌, మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్నవీస్ జూన్ 28న‌ మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గత్ సింగ్ కోషియారీని కలిశారు. శివ‌సేన ప్ర‌భుత్వం మైనారిటీలో ఉంద‌ని ఆయ‌న దృష్టికి తెచ్చారు. దీంతో గ‌వ‌ర్న‌ర్.. ఉద్ధ‌వ్ థాకరేని మ‌ద్ద‌తు నిరూపించుకోవాల‌ని కోరారు. ఇందుకు 48 గంట‌ల స‌మ‌యం ఇచ్చారు. దీనిపై సుప్రీంకోర్టును శివ‌సేన ఆశ్ర‌యించింది. అయితే సుప్రీంకోర్టు గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో మ‌ద్ద‌తు లేక‌పోవ‌డంతో విశ్వాస తీర్మానానికి ముందే ఉద్ధ‌వ్ థాక‌రే జూన్ 29న రాజీనామా చేశారు.

దీంతో జూన్ 30న ఏక‌నాథ్ షిండే మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా, బీజేపీ నేత దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ఉప ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. మ‌రోవైపు శివ‌సేన‌కు లోక్ స‌భ‌లో 18 మంది ఎంపీలు ఉండ‌గా వారిలో 12 మంది షిండేకే జై కొట్టారు.

ఈ నేప‌థ్యంలో జూలై 18న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో శివ‌సేన ఎంపీలంతా ఓటు వేశారు. జూలై 19న‌ ఆ ఎంపీల‌ను తీసుకుని సీఎం షిండే ఢిల్లీ వెళ్లారు. 12 మంది శివ‌సేన ఎంపీల‌ను ప్ర‌త్యేక గ్రూపుగా ప‌రిగ‌ణించాల‌ని, వారికి పార్ల‌మెంటులో ప్ర‌త్యేక కార్యాల‌యం కేటాయించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో స్పీక‌ర్ వారిని శివ‌సేన పార్టీగా ప్ర‌క‌టించారు. శివ‌సేన పార్టీ అధినేత‌గా ఏక‌నాథ్ షిండేను గుర్తించారు.

ఈ నేప‌థ్యంలో రాహుల్ షెవాలే శివసేన కొత్త పార్ల‌మెంట‌రీ నాయ‌కుడిగా ఎంపిక‌య్యారు. అలాగే భావన గవాలీ లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్ గా ఎంపిక‌య్యారు. ఈ నేప‌థ్యంలో గ‌వాలీ జారీ చేసిన విప్‌లు ఇకపై లోక్‌సభలోని 18 మంది శివసేన ఎంపీలకు వర్తిస్తాయి. దీంతో జూన్ 19న మొద‌లైన శివ‌సేన ప‌త‌నం జూలై 19కి వ‌చ్చేస‌రికి పూర్తిగా అంత‌మైపోయింది.