Begin typing your search above and press return to search.

కరోనా వేళ.. కాటికి పంపలేని దైన్యం!

By:  Tupaki Desk   |   21 July 2020 3:01 PM GMT
కరోనా వేళ.. కాటికి పంపలేని దైన్యం!
X
కరోనా మనుషుల్లోని మానవత్వాన్ని చంపేస్తోంది. భయాన్ని సృష్టిస్తోంది. బంధాలను దూరం చేస్తోంది. కరోనా భయం జనాన్ని ఎంతలా ఆవహించిందంటే... తెలిసిన వారు.. మనకు సాయం చేసిన వారు చనిపోయినా కడసారి చూపుకు.. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముందుకు పోని దుస్థితిని సృష్టించింది. చైనా నుంచి వచ్చిన మాయదారి కరోనాతో కుటుంబంలోని వ్యక్తికి కరోనా వచ్చినా దూరం పెడుతున్నారు. ఇక మన పక్కింటివారు.. చుట్టాలు పక్కాలు.. బంధువులు చనిపోయినా చివరి చూపుకు కూడా నోచుకోకుండా వదిలేస్తున్న దైన్యం కనిపిస్తోంది.

తాజాగా కర్నూలు జిల్లాలో ఓ మాస్టారు.. ఓ కిరాణ దుకాణం నిర్వహించే వ్యక్తి చనిపోయారు. ఇద్దరికీ కరోనా లేదు. అయినా వారి పాడే మోసేందుకు.. కనీసం చూసేందుకు కూడా ఎవరూ రాలేదు. ఇరుగుపొరుగూ.. బంధువులు కనీసం కనికరం చూపలేదు. దీంతో అనాథ శవాల్లా వారు పడి ఉన్న ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.

కర్నూలు జిల్లా మద్దెరకు చెందిన వేణుగోపాల్ శెట్టి (80) అనే వృద్ధ టీచర్ వయోభారంతో చనిపోయారు. ఎంతో మందికి చదువు చెప్పి గొప్ప వాళ్లను చేసిన ఆయన అంటే అందరికీ అభిమానం.. కానీ ఎవరూ రాలేదు. బంధువులు కూడా కరోనా భయంతో మొహం చూడలేదు. దీంతో పాడే మోసేందుకు నలుగురు లేక ఆయన ఇద్దరు కుమారులు ఒక ఆటలో భౌతిక కాయాన్ని శ్మశానికి తరలించి ఖననం చేయాల్సిన దుస్థితి నెలకొంది.

ఇక కర్నూలు జిల్లా ప్యాపిలి పట్టణంలో శరత్ (46) అనే వ్యాపారి గుండెపోటుతో మరణించాడు. ఆయన దుకాణంలో పనిచేసే గుమాస్తాకు కరోనా రావడంతో తీవ్ర ఆందోళనకు గురై తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందాడు. అయితే కరోనా భయంతో ఆయన ఇంటికి బంధువులు, స్థానికులు రాకపోవడంతో విషయం తెలిసిన ప్యాపిలీ ఎస్సై మారుతి శంకర్ చలించిపోయి ఒక రిక్షాను తెప్పించి తనే రిక్షా తొక్కుతూ శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వం చాటిన ఎస్సైపై ప్రశంసలు కురిశాయి.

ఇలా కరోనా భయానికి చనిపోతే వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వారి కుటుంబాలకు కనీస అండ కరువైంది. ఇంతటి భయోత్పాన్ని సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ఎప్పుడు తగ్గుతుందో ఏమోనన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది.
Tags: