Begin typing your search above and press return to search.

దారుణం.. అమెరికాలో టీచర్‌ను తుపాకీతో కాల్చిన ఆరేళ్ల బాలుడు..!

By:  Tupaki Desk   |   7 Jan 2023 11:30 AM GMT
దారుణం.. అమెరికాలో టీచర్‌ను తుపాకీతో కాల్చిన ఆరేళ్ల బాలుడు..!
X
అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ పరాకాష్టకు చేరింది. అంగట్లో కూరగాయలు కొనుగోలు చేసేంత ఈజీగా అమెరికన్లు గన్స్ కొనుగోలు చేస్తున్నారు. ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్నామని గొప్పలు చెప్పుకునే అమెరికన్లు.. ఆచరణలో మాత్రం నిత్యం ఎప్పుడో ఏం జరుగుతుందోననే భయాందోళనతో జీవిస్తున్నారని తాజాగా వెలుగు చూసిన సంఘటనతో నిరూపితమైంది..

అమెరికాలో గన్ కల్చర్ అనేది ఎప్పటి నుంచో పెరిగిపోయింది. జాతి వివక్ష.. దొంగతనాలు.. ఇతరత్రా కారణాల రీత్యా అమెరికన్లు సెక్యూరిటీ కోసం లైసెన్స్ గన్స్ తీసుకోవడం ప్రారంభించారు. అయితే అది కాస్తా అక్కడ విశృంఖలంగా పెరిగిపోయింది. ప్రస్తుతం అమెరికాలో మెజారిటీ ప్రజల చేతిలో రివాల్వర్లు ఉండటం కామన్ గా మారిపోయింది.

అయితే దీని వల్ల ఇటీవల కాలంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. సెక్యూరిటీ కోసం తెచ్చుకున్న గన్స్ ను కొందరు కోపంలో కాల్పులకు దిగుతున్నారు. మరికొందరు తెల్సి తెలియక బొమ్మ తుపాకీ మాదిరిగా ఎదుటి వ్యక్తిపై ఫైరింగ్ చేస్తూ ప్రాణాలను బలిగొంటుండటం అమెరికాలో శోచనీయంగా మారింది.

తాజాగా అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఒక ఆరేళ్ల బుడతడు టీచర్ ను తుపాకీతో కాల్చి వేయడం కలకలం సృష్టించింది. అమెరికా కాలమాన ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో న్యూ పోర్ట్ న్యూస్ నగరంలోని రిచ్‌నెక్ ఎలిమెంటరీ స్కూల్లో ఈ కాల్పులు జరిగినట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిగిన బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఆరు నుంచి ఏడేళ్ల వయసు ఉన్న మొదటి తరగతి క్లాస్ రూమ్ లో టీచర్.. విద్యార్థికి మధ్య వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. అనంతరం ఓ బాలుడు టీచర్ పై కాల్పులు చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.

ప్రస్తుతం టీచర్ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. 30 ఏళ్ల వయస్సు ఆ టీచర్ పేరును పోలీసులు మాత్రం వెల్లడించలేదు. అలాగే ఈ సంఘటన ప్రమాదవశాత్తు మాత్రమే జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ పాఠశాలలో మొత్తం 550 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో మెటల్ డిటెక్టర్ సదుపాయాలు ఉండగా విద్యార్థులను అడపా దడపా తనిఖీ చేస్తారు.

అయితే అందరినీ తనిఖీ చేయరని పోలీసులు వివరించారు. ఆ పిల్లాడికి ఆయుధం ఎలా వచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పిల్లోడు వాడిన ఆయుధం ఏంటో చెప్పడానికి పోలీసులు నిరాకరించారు. కాగా ఆ బాలుడు ఒక హ్యాండ్ గన్ తో కాల్పులు జరిపి ఉంటాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.