Begin typing your search above and press return to search.

విమానంలో కన్పించిన పాము.. కలవరానికి గురైన ప్రయాణికులు..!

By:  Tupaki Desk   |   11 Dec 2022 3:56 AM GMT
విమానంలో కన్పించిన పాము.. కలవరానికి గురైన ప్రయాణికులు..!
X
ఇటీవలి కాలంలో అడవుల్లో నివసించే జంతువులు గ్రామాలు.. నగరాల్లోకి వస్తూ జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏనుగులు.. పులులు.. చిరుతలు.. ఎలుగుబంట్లు జనవాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టించిన ఘటనలు అనేకం ఉన్నాయి. వీటిని ఫారెస్ట్ అధికారులు బంధించి మళ్లీ అటవీ ప్రాంతంలో విడిచి పెట్టడం ఈ మధ్య సర్వ సాధారణంగా మారిపోయింది.

కోతులు.. పాములు వంటి జీవాలైతే జనావాల్లోనే తిరుగుతుంటాయి. కోతులెమో ఇల్లు పీకి పందిరేస్తుంటే.. పాములేమో ఒక రకమైన భయానికి గురి చేస్తున్నాయి. విషపూరితమైన పాములు జనావాల్లోకి వస్తుండటంతో వాటి బారిన పడి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తరుచూ జరుగుతున్నాయి.

పాములు ఫ్రిజ్ లో దూరం.. షూలలో దాక్కోవడం.. స్కూటీలో హఠాత్తుగా ప్రత్యక్షమవడం లాంటి వీడియో నెట్టింట్లో తరుచూ వైరల్ అవుతూ ఉన్నాయి. భూమిపైనే కాకుండా ఆకాశంలోనూ (విమానం) పాములు తరుచూ కన్పిస్తూ ప్రయాణీకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే దుబాయ్ ఎయిర్ పోర్టులో జరిగింది. దీంతో ప్రయాణీకులు కలవరానికి గురి కాగా వారి ప్రయాణం మరో ఏడు గంటలు ఆలస్యం కావడంతో వారంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళలోని కాలికట్ నుంచి బీ 737-800 దుబాయ్ కు బయలుదేరింది. అయితే ఈ విమానంలో ఎవరికీ కనిపించకుండా ఒక పాము సైతం జర్నీ చేసింది. విమానం దుబాయ్ లో ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణీకుల లగేజీ తరలించడానికి సిబ్బంది కార్గో హోల్డ్ కు వెళ్లారు. ఆ సమయంలో వీరికి పాము కన్పించడంతో ఆందోళనకు గురై ఎయిర్ పోర్టులోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

వెంటనే వారు అక్కడికి చేరుకొని పామును పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో ప్రయాణికులు సకాలంలో వారి లగేజీలను అందుకోలేకపోయారు. ఈ ఘటనతో ఏకంగా ఏడు గంటల పాటు ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఈ విషయంపై పలువురు ప్రయాణికులు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎయిరిండియాకు యాజమాన్యానికి ట్యాగ్ చేశారు.

ఈ ఘటనపై డీజీసీఏ స్పందిస్తూ.. విమాన ప్రయాణికుల ఆలస్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. కార్గో హోల్డ్ లో పాము కన్పించిన ఉదంతంపై పూర్తి విచారణకు ఆదేశించినట్లు డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు చెబుతున్నారు. పూర్తి సమాచారం వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీజీసీఏ అధికారులు స్పష్టం చేశారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.