Begin typing your search above and press return to search.

ఒక సోషల్ మీడియా పోస్టు.. హుబ్బళ్లి పోలీసు స్టేషన్ ధ్వంసానికి కారణమైంది

By:  Tupaki Desk   |   18 April 2022 5:32 AM GMT
ఒక సోషల్ మీడియా పోస్టు.. హుబ్బళ్లి పోలీసు స్టేషన్ ధ్వంసానికి కారణమైంది
X
సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు పెను వివాదానికి కారణం కావటమే కాదు.. ఏకంగా పోలీస్ స్టేషన్ సైతం ధ్వంసానికి కారణమైంది. ఇప్పటికున్న పంచాయితీలు సరిపోవన్నట్లుగా కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ రగడ కొత్త ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ఒక వర్గాన్ని కించపరుస్తూ మరో వర్గానికి చెందిన వ్యక్తి ఒకరు పెట్టిన పోస్టు పెద్ద రగడకు కారణం కావటమే కాదు.. భారీ విధ్వంసానికి కారణమైంది. ఈ మొత్తం ఎపిసోడ్ కర్ణాటకలోని హుబ్బళ్లిలో చోటుచేసుకుంది. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ.. మొత్తానికి వాతావరణం మాత్రం నివురు గప్పిన నిప్పులా ఉందని మాత్రం చెప్పక తప్పదు.

ప్రస్తుతానికి ఈ నెల 20 వరకు పట్టణంలో 144 సెక్షన్ ను విధించటంతో పాటు 40 మందిని అరెస్టు చేశారు. ఈ ఉదంతంలో మొత్తం 12 మంది పోలీసులు గాయపడటంతో పాటు.. పలు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒక ఆలయంతో పాటు ఆసుపత్రి కూడా దెబ్బ తిన్న వాటి జాబితాలో ఉండటం గమనార్హం.

ఒక వర్గానికి చెందిన వ్యక్తితో పాటు మరికొందరు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇంకొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి బాధ్యులైన ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఇందుకు సంతృప్తి చెందని కొందరు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవటం.. చూస్తుండగానే భారీగా జమ అయిన నేపథ్యంలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. దీంతో.. ఆందోళన చేస్తున్న వర్గానికి చెందిన నాయకుడ్ని పోలీసులు పిలిపించి మాట్లాడారు. అయితే.. పోలీసుల మాట వినని వారు పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు.

దాడిలో ఇటుకలు.. రాళ్లు ఉండటం చూస్తే.. ముందస్తు ప్రణాళికలో భాగంగా లారీలో వీటిని తెచ్చినట్లుగా భావిస్తున్నారు. ఈ ఉదంతం కర్ణాటకలో సంచలనంగా మారింది. ఈ ఉదంతంపై కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బొమ్మై రియాక్టు కావటమే కాదు.. ఎంతటి వారున్నా సహించేది లేదని.. దాడుల వెనుక ఉన్న వారందరిని అరెస్టు చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ ఉదంతానికి రాజకీయ రంగు పులమవద్దన్న ముఖ్యమంత్రి.. దాడి వేళ గాయపడిన పోలీసుల గురించి అడిగి తెలుసుకున్నారు.

దెబ్బలు తిన్న పోలీసుల్లో ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉందని చెబుతున్నారు. భారీ ఎత్తున విధ్వంసానికి కారణమైన వారందరిని అరెస్టు చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా తాజా ఉదంతం కర్ణాటక ఇమేజ్ ను దెబ్బ తీస్తుందని మాత్రం చెప్పక తప్పదు