Begin typing your search above and press return to search.

ఖరీదైన పిల్లి మాయం.. పరుగులు తీసిన పోలీసులు..!

By:  Tupaki Desk   |   10 Jan 2023 11:11 AM GMT
ఖరీదైన పిల్లి మాయం.. పరుగులు తీసిన పోలీసులు..!
X
మియావ్.. మియావ్ పిల్లి.. నిన్ను ఎవరు ఎత్తుకు పోయారంటా? అని పోలీసులు కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. దొంగలను పట్టుకోవడంలో.. శాంతిభద్రతలను కాపాడటంలో బిజీగా ఉండే పోలీసులకు ఒక పిల్లి ఎక్కడలేని తలనొప్పి తెచ్చిపెట్టింది. ఇంతకీ విషయం ఏంటేంటే.. హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఒక అరుదైన పిల్లి కనిపించకుండా పోయింది. దీంతో దానిని పట్టుకునేందుకు పోలీసులు వేట మొదలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

కొంతమందికి పెంపుడు జంతువులు పెంచుకోవడం అంటే ఇష్టం. కుక్కలు.. పక్షులు.. కోళ్లు.. మేకలు.. పిల్లులు తదితర వాటివి పంచుకోవడం మన చుట్టూరా కనిపిస్తూనే ఉంటుంది. విదేశాల్లో పిల్లులు.. కుక్కలను ప్రతి ఇంటా పెంచుకుంటారు. మన దగ్గర కుక్కలను పెంచుకునేవారు ఎక్కువగా ఉంటారు కానీ పిల్లులను మాత్రం చాలా అరుదుగానే పెంచుతుండటం కనిపిస్తుంటుంది.

కాగా హైదరాబాద్ లోని వనస్థలిపురం పరిధిలోని జ‌హంగీర్‌ కాలనీలో షేక్‌ అజహర్‌ మహమూద్ అనే వ్యక్తి తన ఇంట్లో ఓ అరుదైన జాతి పిల్లిని పెంచుకుతున్నాడు. దీనికి నోమనీ అని ముద్దు పేరు కూడా పెట్టుకున్నాడు. ఈ పిల్లిని సుమారు 50 వేల ధరకు కొనుగోలు చేశాడట. ఏడాదిన్నర నుంచి దీనిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు.

ఈ పిల్లికి ఒక కన్ను ఆకుపచ్చ రంగులో.. మరొకటి నీలం రంగులో ఉంది. ఇదే ఆ పిల్లి ప్రత్యేకత అని యజమాని చెబుతున్నాడు. ఈ పిల్లికి సంబంధించిన వీడియోలను మహమూద్ తన సోషల్ మీడియాలో అకౌంట్లో తరుచుగా పోస్టులు చేస్తుంటాడు. దీంతో ఈ పిల్లి ఖరీదు.. దీని ప్రత్యేకత అన్ని కూడా చుట్టుపక్కల వారితో పాటు అందరికీ తెలిసిపోయింది.

ఈ క్రమంలోనే గుర్తుతెలియని వ్యక్తులు పిల్లిని ఎత్తుకుపోయారు. తన పిల్లి కన్పించకపోవడంతో మహమూద్ పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ చేశాడు. తొలుత దీనిని లైట్ తీసుకున్న పోలీసులు అతడి ఒత్తిడి మేరకు కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలోనే తన ఇంటి పరిసరాల్లో సీసీ టీవీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. దీంతో త్వరలోనే పిల్లి దొంగలు ఎవరనేది బయట పడే అవకాశాలున్నాయి. ఈ సంఘటనపై మీ రియాక్షన్ ఏంటో కింద మాతో పంచుకోండి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.