Begin typing your search above and press return to search.

'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' కే చోటు లేని జట్టు.. గావస్కర్ ధ్వజం.. 'రాహుళ్లకు' రాహుకాలం

By:  Tupaki Desk   |   23 Dec 2022 7:53 AM GMT
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కే చోటు లేని జట్టు.. గావస్కర్ ధ్వజం.. రాహుళ్లకు రాహుకాలం
X
ఓ 20-25 ఏళ్ల కిందటి వరకు టీమిండియా పరిస్థితి భలే చిత్రంగా ఉండేది. ఆటగాడి ఫామ్, పరిస్థితులకు అతడు సరిపోతాడా? అని చూడకుండా ఆడించేసేవారు. దీంతో ప్రతిభ ఉన్న ఆటగాడైనా ఆ మ్యాచ్ రాణించకపోవడంతో వేటుకు గురయ్యేవాడు. ఇప్పుడు పేర్లు అనవసరం కాని.. కొన్నిసార్లు ప్రతిభ లేకున్నా ఇలాంటివాళ్లు జట్టుకు ఎంపికై తుది జట్టులో ఆడేవారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రొఫెషనలిజం వచ్చింది. కాగా, టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో జట్టు మేనేజ్ మెంట్ తీసుకున్న ఓ నిర్ణయం అసంబద్ధ నిర్ణయం విషయంలో పాత కాలంనాటి పరిస్థితిని గుర్తుచేస్తోంది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎవరిని ఆడించాలో తెలియదా? బంగ్లాదేశ్ పై తొలి టెస్టులో టీమిండియా ఘన విజయంలో కీలక పాత్ర పోషించింది కుల్దీప్ యాదవ్. ఈ చైనామన్ స్పిన్నర్ తొలి ఇన్నింగ్స్ లో 5, రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు పడగొట్టాడు.

తొలి ఇన్నింగ్స్ లో కీలకమైన 40 పరుగులు చేశాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. అలాంటి వాడిని కాదని రెండో టెస్టులో ఎడమ చేతివాటం పేసర్ జయదేవ్ ఉనద్కత్ కు స్థానం కల్పించారు. దీంతో విమర్శకులకు అనవసరంగా పనికల్పించినట్లయింది. "గత టెస్టులో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన ఆటగాడిని తప్పించడం నమ్మశక్యంగా లేదు. నిజానికి.. ఈ విషయం గురించి మాట్లాడటానికి కఠిన పదజాలాన్ని వాడాలనుకున్నా. కానీ.. ఇలా మర్యాదపూర్వకమైన పదంతో సరిపెడుతున్నా. 20 వికెట్లలో 8 వికెట్లు తన ఖాతాలో వేసుకున్న బౌలర్‌ను అసలు అలా ఎలా తప్పిస్తారు" అంటూ టీమిండియా దిగ్గజ ప్లేయర్‌ సునీల్‌ గావస్కర్‌ మండిపడ్డాడు.

స్పిన్ వికెట్ పై పేలవ నిర్ణయం రెండో టెస్టు జరుగుతున్న మీర్పూర్ వికెట్ పూర్తిగా స్పిన్ కు అనుకూలం. అలాంటిచోట స్పెషలిస్ట్ స్పిన్నర్, గత మ్యాచ్ విన్నర్ అయిన కుల్దీప్ ను తప్పించడం చాలా పేలవ నిర్ణయం. ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లతో మాత్రమే ఆడాలనుకుంటే.. అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌లలో ఎవరో ఒకరిని తప్పించాల్సింది. ఇలాంటి పిచ్‌పై కుల్దీప్ ఇంకా మెరుగ్గా రాణించేవాడు. పిచ్‌ పేస్‌కు అనుకూలంగా మూడో పేసర్‌ను తీసుకున్నామని తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ చెప్పినా, అది సంతృప్తికరమైన వివరణగా అనిపించలేదంటూ క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో గావస్కర్‌ సైతం మేనేజ్‌మెంట్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

రెండో ఇన్నింగ్స్ లో ఎలా? జయదేవ్‌ ఉనాద్కత్ డిసెంబర్‌ 16, 2010న తన తొలి టెస్టు మ్యాచ్‌ బరిలోకి దిగాడు. అందులో ఒకే ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేయగా 26 ఓవర్లలో 101 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. దాంతో టెస్టు టీమ్‌లో మళ్లీ చోటు దక్కలేదు. వరుసగా దేశవాళీ క్రికెట్‌లో చక్కటి ప్రదర్శనలతో పాటు కాస్త అదృష్టం కూడా కలిసి రావడంతో బంగ్లాతో సిరీస్‌కు మళ్లీ టెస్టు పిలుపు లభించింది. అయితే, రెండో టెస్టు తొలి రోజు ఉనాద్కత్ రాణించినా.. రెండో ఇన్నింగ్స్‌లో మూడో స్పిన్నర్‌ అవసరం అనిపిస్తే మాత్రం కుల్దీప్‌ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. దీనిని అధిగమించాలంటే అశ్విన్, అక్షర్
శక్తికి మించి రాణించాల్సిందే.

కోచ్, కెప్టెన్ ఇదేం తీరు? భారత బ్యాటింగ్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ నంబర్ వన్ అయితే, నంబర్ 2 రాహుల్ ద్రవిడ్. కానీ, వైస్ కెప్టెన్ గా ఎంతో సమర్థంగా వ్యవహరించిన ద్రవిడ్ కు ఎందుకనో నాయకత్వం కలిసిరాలేదు. ఇప్పుడు కోచింగ్ కూడా అంతే. అండర్ 19, ఎ జట్ల కోచ్ గా అద్భుతాలు సాధించిన ద్రవిడ్.. సీనియర్ జట్టు కోచ్ గా పూర్తిగా విఫలం అవుతున్నాడు. నిరుటి ఇంగ్లండ్ లో టెస్టు ఓటమి, ప్రపంచ చాంపియన్ షిప్
చేజారడం, ఆసియా కప్, టి20 ప్రపంచ కప్ ఇలా ఎన్నో పరాజయాలు. చివరకు కీలకమైన బంగ్లాదేశ్ తో రెండో టెస్టులో కుల్దీప్ ను కాదని ఉనాద్కత్ ను ఆడించడం కూడా వివాదాస్పదం అవుతోంది. ఇక కేఎల్ రాహుల్ కెప్టెన్ గా లేకుంటే ఈ మ్యాచ్ బరిలో దిగేందుకు అర్హుడేనా? అనే అనుమానం కలుగుతోంది. తొలి టెస్టులో విఫలమైన అతడు ఈసారి 10 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో జట్టులో రాహుల్ ఉనికే ప్రశ్నార్థకం కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.