Begin typing your search above and press return to search.

పవన్ కు ఓటేసినోళ్లంతా తలా రూ.500 ఇవ్వాలా?

By:  Tupaki Desk   |   3 Sep 2019 6:49 AM GMT
పవన్ కు ఓటేసినోళ్లంతా తలా రూ.500 ఇవ్వాలా?
X
పైసా మే పరమాత్మ అనేస్తుంటారు పెద్దోళ్లు. పైసలు లేనిదే ఏ పని చేయలేరంటారు. అందునా రాజకీయాలు చేయాలంటే ఉత్తనే కాదు. భారీ ఖర్చు ఉంటుంది. ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్న జనసేన లాంటి పార్టీని నడపాలంటే ఖర్చు మామూలుగా ఉండదు. మరి.. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు జనసైనికులు భారీగా స్కెచ్ వేసినట్లుగా వెల్లడించారు పవన్ సోదరుడు నాగబాబు.

బర్త్ డే బాయ్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేనానికి కానుకగా రూ.100 కోట్ల పార్టీ ఫండ్ సేకరించి ఇవ్వాలని డిసైడ్ అయినట్లుగా చెప్పారు. జనసేనకు అవసరమైన నిధిని సేకరించే విషయంలో పవన్ అభిమానుల అంకితభావానికి నిదర్శనమన్నారు. తాము నిర్దేశించుకున్న రూ.100 కోట్ల నిధికి ఇప్పటికే కొంత మొత్తాన్ని జమ చేయటం వారికున్న శ్రద్ధగా అభివర్ణించారు.

ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్న ప్రాంతీయ పార్టీ రూ.100 కోట్ల పార్టీ ఫండ్ ను సేకరించటం మామూలు విషయం కాదు. ఇంతకీ రూ.100 కోట్ల నిధి సమకూర్చాలన్న ప్లాన్ ఎలా వచ్చి ఉంటుంది? ఏ లెక్క ఆధారంగా ఇంత భారీ మొత్తాన్ని సమీకరించొచ్చని భావించారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. పవన్ సినిమాకు అయితే భారీ కలెక్షన్ల ను ఆశించొచ్చు. కానీ.. సినిమా ఏమీ లేకుండా ఇంత భారీ మొత్తాన్ని పార్టీ నిధి రూపంలో ఎలా సేకరిస్తారు? అన్న ప్రశ్నకు వినిపిస్తున్న సమాధానం ఆసక్తికరంగా మారింది.

రూ.100 కోట్ల నిధిని సేకరించటం పెద్ద విషయం కాదని.. జనసేనాధికి ఉన్న ఇమేజ్ తో అది సాధ్యమేనని చెబుతున్నారు. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో జనసేనకు 6.8 శాతం ఓట్లు వచ్చాయి. దీన్ని ఓట్లల్లో లెక్క వేస్తే 20లక్షల ఓట్లుగా తేలింది. అవినీతి లేని రాజకీయాల్ని చూడటమే లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కల్యాణ్.. ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బులు పంచేందుకు ఏ మాత్రం ఇష్టపడలేదు. ఇదే తరహా రాజకీయాన్ని రానున్న రోజుల్లోనూ కొనసాగించాలని భావిస్తున్న పవన్.. పార్టీని నడిపేందుకు భారీ ఫండ్ ఉంటే మంచిదన్న ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా రూ.100 కోట్ల నిధి అభిమానులు సమకూర్చాలన్న వాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.

మరింత.. భారీ నిధి సేకరణ ఎలా సాధ్యమన్న విషయాన్ని చూస్తే.. ఎన్నికల్లో పార్టికి ఓటేసిన 20 లక్షల మంది తలో రూ.500 చొప్పున ఇచ్చేస్తే.. రూ.100 కోట్లు సమీకరించటం పెద్ద విషయం కాదన్న మాటను చెబుతున్నారు. ఆ లెక్కన చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పవన్ అభిమానులు స్వచ్చందంగా రూ.200 చొప్పున ఇచ్చినా రూ.100 కోట్లకు పైనే నిధి సమకూరుతుందంటున్నారు. అంచనాలకు బాగానే ఉంటాయి.. మరి వాటిని అమలు చేసేదెవరు? రూ.100 కోట్ల నిధిని విమర్శలకు అతీతంగా ఎలా సేకరిస్తారన్నది అసలుసిసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.