Begin typing your search above and press return to search.

ప్రపంచంలో ఏ దేశానికీ చెందని మహిళ, 50 ఏళ్లుగా భారత్‌ లో..!

By:  Tupaki Desk   |   1 Aug 2022 7:30 AM GMT
ప్రపంచంలో ఏ దేశానికీ చెందని మహిళ, 50 ఏళ్లుగా భారత్‌ లో..!
X
50 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తోంది ఓ మహిళ. ఆమెకు భరత గడ్డ మీదే పెళ్లి అయింది.. పిల్లలు పుట్టారు. డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కూడా ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఆమె భారతీయురాలు అని చెప్పుకోవడానికి కావాల్సిన అన్ని రకాల ధ్రువ పత్రాలున్నాయి. అయినా ఆమె ఆమె విదేశాలకు వెళ్లలేరు. ఎందుకంటే ఆమెకు పాస్‌పోర్ట్ లేదు. ఇదే విషయమై ఇప్పుడు ఆమె ముంబయి హైకోర్టును ఆశ్రయించారు. తనకు పాస్‌పోర్ట్ జారీ చేయాల్సిందిగా భారత అధికారులకు ఆదేశాలివ్వాలంటూ కోర్టును కోరారు.

66 ఏళ్ల పోపట్ 1955లో యుగాండా లో జన్మించారు. ఆమెకు పదేళ్లు ఉన్నప్పుడు తన తల్లి పాస్‌పోర్ట్‌ పై ఓడలో భారతదేశానికి చేరుకున్నారు. అప్పటి నుంచి పోపట్ భారత దేశంలోనే నివసిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా భారత పాస్‌పోర్ట్ సంపాదించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. కానీ రాలేదు. మూడు దేశాలు ఆమెను "ఏ దేశానికి చెందని మహిళ"గా ముద్ర వేశాయి. "ప్రతిసారి నా పౌరసత్వంపై ప్రశ్న వస్తుంది. ఆ ప్రక్రియ అక్కడ ఆగిపోతుంది" అని పోపట్ చెప్పారు.

ఇలా పోపట్ తండ్రి గుజరాత్‌లోని పోర్‌బందర్‌ లో పుట్టి పెరిగారు. 1952లో ఆయన ఉద్యోగం కోసం యుగాండా వెళ్లారు. కొన్నేళ్ల తరువాత ఆయనకు బ్రిటిష్ పాస్‌పోర్ట్ వచ్చింది. ఇలా పోపట్ 1955లో తూర్పు ఆఫ్రికా దేశంలోని కములి పట్టణంలో జన్మించారు. అప్పటికి ఆ దేశం ఇంకా బ్రిటిష్ పాలనలో ఉంది. తర్వాత ఏడేళ్లకు స్వతంత్రం పొందింది. 1966లో యుగాండా లో తీవ్ర రాజకీయ గందరగోళం ఏర్పడింది. అత్యవసర పరిస్థితి ని ప్రకటించి, రాజ్యాంగాన్ని రద్దు చేశారు. దాంతో, ఇలా పోపట్ తల్లి తన ఇద్దరు పిల్లలను తీసుకుని భారతదేశం వచ్చేశారు.

"నేను మైనర్‌గా ఉన్నప్పుడు భారత్ వచ్చాను. మా అమ్మ పాస్‌పోర్ట్‌లో నా పేరు ఉంది. అమ్మ పాస్‌పోర్ట్‌లో ఆమెను 'బ్రిటిష్ ప్రొటెక్టెడ్ పర్సన్' అని పేర్కొన్నారు. ఇది ఇంగ్లాండ్ ప్రభుత్వం ఇచ్చే ఒక విధమైన జాతీయ గుర్తింపు" అని పోపట్ చెప్పారు. పోపట్ 1997లో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. భారతదేశంలో '1955 పౌరసత్వ చట్టం' ప్రకారం ఇక్కడి వ్యక్తిని వివాహం చేసుకుని, ఏడేళ్ల పాటు ఇక్కడే నివసిస్తే పౌరసత్వానికి అర్హత పొందవచ్చు. కానీ, ఆమెకు అనుకూలంగా నిర్ణయం రాలేదు. దరఖాస్తును తిరస్కరించారు.

అప్పుడు ఆమె ముంబైలోని బ్రిటిష్ హైకమిషన్‌ను ఆశ్రయించారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరికీ బ్రిటిష్ పాస్‌పోర్ట్‌ ఉన్నందున, తనకు బ్రిటిష్ పౌరసత్వం లభించగలదని ఆశించారు. ఆమె తల్లి తరపు బంధువులు ఇప్పటికీ బ్రిటన్‌లో ఉన్నారు. కానీ, ఆమెకు బ్రిటిష్ పాస్‌పోర్ట్ పొందేందుకు అర్హత లేదని తేల్చిచెప్పారు. ఎందుకంటే, ఆమె తండ్రి లేదా తాత 1962 తరువాత బ్రిటన్‌లోగానీ లేదా దాని వలస రాజ్యాల్లోగానీ "పుట్టలేదు, అక్కడ వారి పేరు నమోదు కాలేదు", కాబట్టి ఆమెకు బ్రిటిష్ పాస్‌పోర్ట్ రాదు. అయితే పోపట్‌కు యుగాండా పాస్‌పోర్ట్ లభించే అవకాశం ఉంది కానీ, "యుగాండా ప్రభుత్వం కూడా పాస్‌పోర్ట్ ఇచ్చేందుకు తిరస్కరిస్తే మీరు ఏ దేశానికి చెందని వ్యక్తి (స్టేట్‌లెస్) అవుతారు" అని కూడా బ్రిటిష్ హైకమిషన్ పేర్కొంది.

2019లో ఆమె భారత పౌరసత్వం కోసం దరఖాస్తు పెట్టుకున్నారు, కానీ తిరస్కారమే ఎదురైంది. ఆమె సరైన వీసా లేదా పాస్‌పోర్ట్ లేకుండా దేశంలో నివసిస్తున్నారని, అందుకే 1955 పౌరసత్వ చట్టంలోని షరతులు వర్తించవని అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది పోపట్‌కు తీవ్ర నిరాశను మిగిల్చింది. 2022లో బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు.

"నా భర్త భారతీయుడు. నా పిల్లలు, మనుమలు కూడా భారతీయులే. ఆధార్ సహా అన్ని ప్రభుత్వ పత్రాలు నా దగ్గర ఉన్నాయి. కానీ, ఇవేమీ సరిపోవు అంటున్నారు" అని పిటిషన్‌లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. బాంబే హైకోర్టు ఆగస్టు లో ఇలా పోపట్ కేసును విచారించనుంది. "ఇప్పటికే బ్రిటన్‌లో నా ఇద్దరు మేనల్లుళ్ల వివాహానికి హాజరు కాలేక పోయాను. ఇప్పుడు దుబాయ్‌లో మరో మేనల్లుడి పెళ్లి జరగబోతోంది. అది కూడా మిస్ అవుతాను" అని ఆమె అన్నారు. ఎప్పటికైనా భారత పౌరసత్వం పొందాలన్నదే తన కోరిక అని ఇలా పోపట్ చెప్పారు