Begin typing your search above and press return to search.

కారుతో గుద్ది.. కసిగా 4 కి.మీ. ఈడ్చుకెళ్లి.. ఢిల్లీలో యువతి హత్య?

By:  Tupaki Desk   |   2 Jan 2023 6:57 AM GMT
కారుతో గుద్ది.. కసిగా 4 కి.మీ. ఈడ్చుకెళ్లి.. ఢిల్లీలో యువతి హత్య?
X
దేశ రాజధాని ఢిల్లీ అంటే అంతే.. ఘోరమైన నేరాలకు అక్కడ హద్దే ఉండదు.. నిర్భయ నుంచి మొన్నటి శ్రద్ధా వాకర్ వరకు.. ఎన్నో ఉదంతాలు.. కదులుతున్న బస్ లో నిర్భయ పై రేప్ ఎంతటి సంచలనం రేపిందో.. శ్రద్ధాను హత్య చేసి 35 ముక్కలుగా చేసిన దారుణం మన కళ్లెదుటే జరిగింది. ఇప్పుడు ఏమో కాని.. ఓ 30 ఏళ్ల కిందట ఢిల్లీలో క్రైం రేట్ బాగా ఎక్కువ. అయితే, కొన్నేళ్లలో పరిస్థితి బాగా మారింది. పోలీసింగ్ పెరిగింది. ఆర్గనైజేషనల్ క్రైం తగ్గినా.. పర్సనల్ క్రైం పెరుగుతోంది. ఇలాంటివి బయటపడితేనే కాని.. తెలియదు. తాజాగా నూతన సంవత్సరం తొలి రోజున ఘోరం చోటుచేసుకుంది. అంజలి అనే 20 ఏళ్ల యువతి స్కూటీపై వెళ్తుండగా, ఓ కారు ఢీకొట్టింది. 4 కి.మీ.దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడి ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఇది ప్రమాదమని పోలీసులు చెబుతుండగా, మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదం కాదు హత్యే...

ఈ దారుణంలో మరిన్ని విషయాలు వెల్లడవుతున్నాయి. అంజలి శరీరాన్ని కొన్ని కిలోమీటర్లు ఈడ్చుకెళ్లడం.. ఆమె శరీరం ఛిద్రమవడానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించిన వివరాలు దిగ్భ్రాంతిగొలుపుతున్నాయి. కారులో ఉన్నవారు తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అంజలి శరీరంపై దుస్తులన్నీ పూర్తిగా తొలగిపోయి నగ్న స్థితిలో మృతదేహం కనిపించిందని ఆమె తల్లి రేఖ చెబుతుండడంతో ఘటనపై అనుమానాలు రేగుతున్నాయి. పోలీసులు చెబుతున్నదాని ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 3.24 గంటలకు ఓ వ్యక్తి కంఝన్‌వాలా పోలీస్‌ స్టేషన్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి.. చక్రాల మధ్యలో చిక్కుకున్న ఒకరిని కారు ఈడ్చుకెళ్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఓ యువతి మృతదేహం నగ్నస్థితిలో రోడ్డుపై కనిపించిందని 4 గంటలకు మరో ఫోన్‌ వచ్చింది.

పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ దృశ్యాల సాయంతో కారును గుర్తించి అందులో ఉన్న అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు. తమ కారుకు ప్రమాదం జరిగిందని, అయితే బాధితురాలు వాహనం కింద చిక్కుకున్నట్లు తమకు తెలియదని వారు చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరో చోట మృతురాలి స్కూటీని గుర్తించారు. కారు 4 కి.మీ. మేర ఈడ్చుకెళ్లడం వల్లే అంజలి మృతదేహంపై బట్టలు చిరిగిపోయాయని పోలీసులు చెప్పారు.

ఆమెను అత్యాచారం చేసి చంపారంటూ వస్తున్నవార్తల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. అంజలి ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసేదని, నూతన సంవత్సరం నేపథ్యంలో ఓ వేడుకలో సేవలందించి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనపై దిల్లీ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు స్వాతి మలివాల్‌ స్పందించారు. కేసులో నిజానిజాలు తేల్చి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు నోటీసులు ఇచ్చారు.

ఇక ప్రత్యక సాక్షి చెప్పినదాని ప్రకారం..

అంజలిని కారు ఈడ్చుకెళ్లిన ఘటనకు ప్రత్యక్ష సాక్షి దీపక్‌ దహియా. అతడు చెప్పినదాని ప్రకారం తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో అతడికి 100 మీటర్ల దూరంలో ఏదో వాహనం వద్ద చప్పుడు వినిపించింది. తొలుత టైర్ పేలి ఉంటుందని సరిపెట్టుకున్నా.. ఓ కారు మహిళ శరీరాన్ని ఈడ్చుకుపోవడం చూశాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పది నిమిషాల్లో కారు యూటర్న్ తీసుకుంది. అప్పటికీ మృతదేహం కారు చక్రాల వద్ద చిక్కుకునే ఉంది. కారులోని వ్యక్తులు మళ్లీమళ్లీ యూటర్న్‌లు తీసుకున్నారు.

వారిని ఆపేందుకు దహినా గట్టిగా ప్రయత్నించినా వీలుకాలేదు. గంటన్నరపాటు.. దాదాపు 20 కిలోమీటర్లు ఆ మృతదేహాన్ని డ్చుకెళ్లారు. ఆ తర్వాత కంజావాలా రోడ్డులో జ్యోతి గ్రామం వద్ద అంజలి మృతదేహం కిందపడింది. అది కేవలం ప్రమాదం మాత్రమే కాకపోవచ్చు అని అంటున్నాడు. కాగా, కారు విండోలు మూసి ఉండడం, మ్యూజిక్ శబ్దం ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రమాదాన్ని గుర్తించలేదని నిందితులు చెప్పినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. కారు నంబరు ప్రకారం గుర్తించి ఐదుగురిని అరెస్టు చేశారు. 'ఈ ఘటన గురించి విని నాకు తలకొట్టేసినట్లైంది. నిందితుల భయంకరమైన ప్రవర్తన దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై పోలీసులతో సంప్రదింపులు జరిపాను. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది' అని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ట్వీట్ చేశారు. 'ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు. దోషులను కఠినంగా శిక్షిస్తారని ఆశిస్తున్నాను' అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.