Begin typing your search above and press return to search.

తిప్పతీగతో కోట్లు కొల్లగొడుతోన్న యువ వ్యాపారి

By:  Tupaki Desk   |   31 May 2021 12:00 PM IST
తిప్పతీగతో కోట్లు కొల్లగొడుతోన్న యువ వ్యాపారి
X
తిప్పతీగ .. మేము తాడు తీగ , రాగి తీగ , చివరికి బంగారం తీగ కూడా చూశాం కానీ , ఈ తిప్ప తీగ గురించి మాకు తెలియదే అని ఆలోచిస్తున్నారా ! నగరాల్లో ఉండేవారికి ఈ తీగ గురించి పెద్దగా తెలిసే అవకాశం అయితే లేదు. ఇక పల్లెల్లో ఉండేవారికి ఈ తీగ గురించి కొంచెం తెలిసే ఉంటుంది. రోడ్డు పక్కన పొదల్లో సాధారణంగా కనిపించే మూలిక.. తిప్పతీగ. చాలామంది దీన్ని చూసే ఉంటారు. కానీ, దాని గొప్పదనమే తెలియదు. కరోనా కాలంలో ఆరోగ్యానికి అత్యంత ఆవశ్యకమైనది ఇదేనని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. రోగనిరోధశక్తిని పెంచటంలో తిప్పతీగకు మరేది సాటిరాదని అంటున్నారు. తమలపాకు రూపంలో చిన్నగా ఉండే ఈ ఆకు, కాండం, వేర్లలో విశేషమైన వైద్య గుణాలు ఉన్నాయని కొందరు చెప్తున్నారు. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి తిప్పతీగ ఆకులను బాగా నూరి గోలిలా ఉండలు చేసి 10 రోజుల పాటు ఉదయం, సాయంత్రం తీసుకొంటే రోగనిరోధకశక్తి పెరుగుతుందని వెల్లడించారు. జ్వరం కూడా రాదని, వచ్చినా వెంటనే తగ్గిపోతుందని ,కీళ్ల సమస్యలు, ఎముకల వ్యాధులు, కాలే యం, మెదడు సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ ఇబ్బందులు, కిడ్నీ సంబంధిత జబ్బులు, మధుమేహంతో పాటు అనేక సమస్యలను తిప్పతీగ తగ్గిస్తుందని వెల్లడించారు. తిప్పతీగకు మరణం ఉండదని, వేర్లు తెంచినా పైనున్న తీగలు అల్లుకుంటూనే ఉంటాయని పెద్దలు చెప్తుంటారు. ఇదిలా ఉంటే .. క‌రోనా కార‌ణంగా చాలామంది కొలువులు కోల్పోతుంటే , తిప్ప‌తీగ‌తో రూ.కోట్ల కాంట్రాక్టుతో వ్యాపారంలో దూసుకుపోతున్నాడు ఓ యువ గిరిజన వ్యాపారి.

వివరాల్లోకి వెళ్తే ... మహారాష్ట్రలోని ఠాణే ,షాహ్ పుర్ తాలుకాలోని ఖరిద్ కు చెందిన సునీల్ కు స్థానిక అడవుల్లో లభించే ఔషధ గుణాలున్న మొక్కలపై కొంచెం ఎక్కువగానే అవ‌గాహ‌న ఉంది. ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెంచడంలో తిప్పతీగ బాగా ఉప‌యోగ‌ప‌డుతుందని కనుగొని , రెండు సంవత్సరాల క్రితం దానిని సేకరించి కంపెనీలకు అందించే వ్యాపారాన్నిప్రారంభించాడు. అందులో భాగంగా కట్కరీ తెగకు ఉపాధి కల్పిస్తూ ప్రధానమంత్రి వన్ ధన్ పథకం సాయంతో వన్ ధన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. దానితో ఏడాదికి రూ.3 నుంచి రూ.5 లక్షలు సంపాదించేవాడు. కరోనా మహమ్మారి కారణంగా తిప్పతీగకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీంతో డాబర్, బైద్యనాథ్, హిమాలయ వంటి సంస్థలకు 350 టన్నుల తిప్పతీగ సరఫరా చేసేందుకు అతడు ఏకంగా రూ.1.57కోట్ల కాంట్రాక్టును దక్కించుకున్నాడు. ప్రస్తుతం షాహ్ పుర్ లోనే సునీల్ కు 6 వన్ ధన్ కేంద్రాలున్నాయి.