Begin typing your search above and press return to search.

ఫేస్ బుక్ ప్రేమ.. కలిసే ప్లాన్ ప్రాణం మీదకు తీసుకొచ్చింది

By:  Tupaki Desk   |   27 Oct 2021 4:19 AM GMT
ఫేస్ బుక్ ప్రేమ.. కలిసే ప్లాన్ ప్రాణం మీదకు తీసుకొచ్చింది
X
ఫేస్ బుక్ లో పరిచయం. సరదాగా మొదలైన ఈ వ్యవహారం ప్రేమ వరకు వెళ్లింది. ఆన్ లైన్ లో మాట్లాడుకోవటం.. చాటింగ్ చేసుకోవటమే తప్పించి నేరుగా కలిసింది లేదు. తాను ఊరికి వస్తున్నానని.. పెళ్లికి వెళ్లాల్సి ఉందని.. కలుద్దామన్న ఆమె మాటకు హుషారుగా సిద్ధమైన విజయవాడ కుర్రాడి ప్రాణాల మీదకు తీసుకొచ్చిన ఉదంతమిది. విన్నంతనే షాకింగ్ గానే కాదు.. అందరిని అప్రమత్తం అయ్యేలా చేసే ఈ ఉదంతంలోకి వెళితే..

బెజవాడ భవానీపురానికి చెందిన యార్ల గడ్డ డేవిడ్ విజయవాడ లోని ఒక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో జాబ్ చేస్తున్నాడు. హైదరాబాద్ లో ఐటీ కంపెనీలో పని చేస్తున్న కంకిపాడు ప్రాంతానికి చెందిన ఒక యువతితో రెండేళ్ల క్రితం పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆ యువతి సోమవారం సాయంత్రం డేవిడ్ కు ఫోన్ చేసి తాను మైలవరం మండలం పుల్లూరులోని తన మామయ్య వాళ్ల ఇంటి వద్ద ఉన్నానని.. రాత్రికి గుంటూరులో పెళ్లికి వెళ్లాల్సి ఉన్నందున తనను తీసుకెళ్లాలని కోరింది.

దీంతో కారులో బయలుదేరిన డేవిడ్ ఆమెకు ఫోన్ చేసి అడ్రస్ అడిగితే.. తన సోదరులు వచ్చి తీసుకొస్తారని చెప్పింది. కాసేపటికి యువతి సోదరులుగా వచ్చిన వ్యక్తులు ఇద్దరు అతడ్ని కారు లో జమలాపురం మార్గానికి తీసుకెళుతూ దారి లోనే బ్లేడ్ తో అతని మెడ.. చేతుల్ని కోశారు. తీవ్ర గాయాల తో ఉన్న అతడ్ని.. బుడమేరు కాలువలో పడేశారు. అతని వద్ద ఫోన్.. ఉంగరాలు.. డబ్బులు లాక్కొని పరారయ్యారు.అతని కారు ను నేషనల్ హైవే బైపాస్ మీద వదిలేసి వెళ్లిపోయారు.

కాలువ లో పడిన బాధిత యువకుడికి లక్కీ గా దుంగ దొరకటంతో అతి కష్టమ్మీద ఒడ్డుకు వచ్చి పోలీసులకు విషయాన్ని చెప్పాడు. తాను ఆ అమ్మాయిని ప్రేమించటం తో.. తను రమ్మంటే వచ్చానని చెప్పాడు. ఆ అమ్మాయి ఫోటోలు చూపించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ అమ్మాయి ఎవరన్న విషయాన్ని తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసి.. విచారణ ముమ్మరం చేశారు. ఇప్పుడీ ఉదంతం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ఆన్ లైన్ ప్రేమలు.. సోషల్ మీడియా పరిచయాల విషయంలో కాసింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నది మర్చి పోకూడదు.