Begin typing your search above and press return to search.

మాస్క్ లేదని చితకబాదిన పోలీసులు , మరణించిన యువకుడు !

By:  Tupaki Desk   |   22 July 2020 12:31 PM GMT
మాస్క్ లేదని చితకబాదిన పోలీసులు , మరణించిన యువకుడు !
X
పోలిసుల అత్యుత్సహం ప్రకాశం జిల్లా చీరాలలో ఓ యువకుడి ప్రాణం తీసింది. మాస్క్ పెట్టుకోలేదనే కారణంతో ఓ యువకుడిని ఎస్సై చితకబాదటంతో అతను దెబ్బలుతాళలేక ప్రాణాలు కోల్పోయిన దారుణం ప్రకాశం జిల్లా చీరాలలో చోటు చేసుకుంది. దీనిపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడుతున్నారు.

దీనిపై పూర్తి వివరాలు చూస్తే .. చీరాలలో మూడు రోజుల క్రితం కిరణ్‌ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి బైక్ ‌పై బయటకు వచ్చాడు. ద్విచక్రవాహనంపై చీరాల ఎస్‌ ఐ విజయ్ ‌కుమార్‌ వారిని ఆపి మాస్క్‌ ధరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్క్ పెట్టుకోలేదన్న కోపంలో ఎస్సై యువకుడిని కొట్టాడు. దీంతో అతను బైక్ మీద నుంచి పడిపోవడంతో యువకుడి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే సృహ తప్పి పడిపోతాడు. దీనితో వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కిరణ్ ఈ రోజు మృతి చెందాడు. అయితే కిరణ్ ను తాము కొట్టలేదని జీపులో తరలిస్తున్న సమయంలో కిందకు దూకడంతోనే గాయాలయ్యాయని చీరాల 2 టౌన్ సిఐ ఫిరోజ్ చెప్పారు.

అయితే , అతని కుటుంబ సభ్యులు మాత్రం పోలీసుల దెబ్బల వల్లనే కిరణ్‌ చనిపోయాడని , ఆ ఎసై విజయ్ కుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎసై విజయ్ కుమార్‌పై హత్య, ఎస్సీ , ఎస్టీ కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. కిరణ్‌ తండ్రి మోహన్‌రావు చీరాలలో రేషన్ డీలర్‌ గా పనిచేస్తున్నారు. ఈ వ్యవహారం పై పూర్తి వివరాలను సేకరించాలని జిల్లా ఎస్పీని సీఎంవో కార్యాలయం ఆదేశించింది. ఈ ఘటనపై స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి మరణించిన కిరణ్‌ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి అధికారులుతో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు.