Begin typing your search above and press return to search.

పౌరసత్వం నిరూపించుకోండి ....127 మంది హైదరాబాదీలకు నోటీసులు !

By:  Tupaki Desk   |   19 Feb 2020 10:30 AM GMT
పౌరసత్వం నిరూపించుకోండి ....127 మంది హైదరాబాదీలకు నోటీసులు !
X
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం పై ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ చట్టాన్ని దేశంలోని ముస్లిములు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ కేంద్రం మాత్రం ఈ నిర్ణయం పై వెనక్కి తగ్గే ప్రసక్తి లేనేలేదు అని తేల్చిచెప్పింది. ఈ తరుణంలో హైదరాబాద్ లో మీ పౌరసత్వం నిరూపించుకోండి అంటూ 127 మందికి ఆధార్ సంస్థ నోటీసులు జారీచేసింది. అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఫిబ్రవరి 20లోగా విచారణకు రావాలని ఆదేశించింది. సరైన పత్రాలు సమర్పించకపోయినా, భారత పౌరులమని నిరూపించుకోకపోయినా వారి ఆధార్‌ కార్డులను రద్దు చేస్తామని హెచ్చరించింది.

దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)పై తీవ్ర దుమారం రేగుతున్న వేళ.. నగరంలోని పలువురికి ఆధార్ సంస్థ ఇలాంటి షాకివ్వడం సంచలంగా మారింది. ఇందులో భాగంగా ముందుగా సత్తర్ ఖాన్, అనే ఆటో రిక్షా డ్రైవర్‌ కి నోటీసులు అందాయి. నువ్వు భారత పౌరుడివి కాదని, నకిలీ ధృవపత్రాలను సృష్టించి ఆధార్ కార్డ్ తీసుకున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని ఆధార్ సంస్థ తెలిపింది. దీనితో సరైన గుర్తింపు పత్రాలతో వచ్చి పౌరసత్వం నిరూపించుకోవాలని , సరైన పత్రాలు చూపక పోయినా, గురువారంలోగా విచారణ అధికారి ముందు హాజరు కాకపోయినా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేసింది.

ఈ నోటీసులను ఆ వ్యక్తి మంగళవారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం తో ఈ విషయం వెలుగు లోకి వచ్చింది. యూఐడీఏఐకు పౌరసత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదంటూ విమర్శలు వెల్లువెత్తడంతో , ఆ సంస్థ అధికారులు స్పందించారు. కొంతమంది అక్రమ వలసదారులు తప్పుడు పత్రాలతో ఆధార్‌ కార్డులు పొందారంటూ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకే 127 మంది హైదరాబాదీలకు నోటీసులు పంపించామని అక్రమ వలసదారులకు ఆధార్‌ మంజూరు చేయరాదని సుప్రీంకోర్టు చెబుతోంది అని తెలిపారు. అలాగే ఆధార్‌ చట్టం ప్రకారం ఆధార్‌ కార్డు కు దరఖాస్తు చేయడానికి ముందు భారత్‌ లో 182 రోజులపాటు నివసించాలన్న నిబంధన ఒకటి ఉందని గుర్తు చేశారు. ఇకపోతే , ఒరిజినల్‌ ధృవ పత్రాలు సమకూర్చుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో విచారణను మే నెలకు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.