Begin typing your search above and press return to search.

డ్రైవింగ్ చేస్తున్నారా? ఆధార్ జేబులో ఉందా..?

By:  Tupaki Desk   |   24 July 2016 5:20 AM GMT
డ్రైవింగ్ చేస్తున్నారా? ఆధార్ జేబులో ఉందా..?
X
హైదరాబాద్ మహానగరంలో మీరు డ్రైవింగ్ చేస్తున్నారా? అయితే.. ఈ వార్త మీకోసమే. ఒకవేళ మీకు డ్రైవింగ్ చేసే అలవాటు లేకున్నా.. మీ డ్రైవర్ కు సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాల్లో ఇదొకటి. ఇప్పటివరకూ వాహనాలు నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోయేది. వాహనాన్ని తనిఖీ చేసే విషయంలో వాహన రిజిష్ట్రేషన్ వివరాలు.. బీమా.. పొల్యూషన్ సర్టిఫికేట్ ఉంటే సరిపోయేది. వీటితో పాటు.. ఇప్పుడు మరొకటి కూడా తప్పనిసరి చేశారు.

వాహన డాక్యుమెంట్లతో పాటు.. ఆదార్ కార్డును కూడా చూపించాల్సి ఉంటుంది. వెహికిల్ పేపర్స్ తో పాటు వాహనాన్ని నడిపే వ్యక్తి ఆధార్ కార్డును కూడా ఇకపై తనిఖీ చేయనున్నారు. ఒకవేళ.. వెహికిల్ డాక్యుమెంట్లు ఉండి.. ఆధార్ లేకున్నా వాహనాన్ని జప్తు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఒకవేళ తనిఖీ చేయటంలో ఆధార్ లేకుండా వాహనాన్ని తమ స్వాధీనంలోకి తీసుకునే పోలీసులు.. ఆధార్ కార్డును చూపించిన తర్వాత మాత్రం వారికి వాహనాన్ని తిరిగి ఇచ్చేస్తారు.

ఆధార్ ఉంటే నేరం చేసి పారిపోయే వారిని సులువుగా పట్టుకునేందుకు వీలు అవుతుందన్న కారణంతో ఆధార్ ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆధార్ తో తాగి నడిపే డ్రైవర్ల వివరాలు కూడా తెలుసుకునే వీలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే.. మద్యాన్ని విక్రయించేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి చేయటంతో.. తాగి బండి నడిపిన వారి ఆధార్ తో వివరాలు క్రాస్ చెక్ చేసినప్పుడు.. సదరు వాహనదారుడు ఏ మద్యం షాపులో మద్యాన్ని కొనుగోలు చేశారన్నది కూడా ఇట్టే తెలిసిపోతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతున్న వారిలో ఎక్కువ మంది మైనర్లు ఉండటం.. వారి వయసును నిర్ధారించటం సమస్యగా మారటంతో.. డ్రైవింగ్ చేసే వారు ఆధార్ కార్డును చూపించాలన్న రూల్ ని తాజాగా డిసైడ్ చేశారు. మారిన రూల్స్ నేపథ్యంలో మీరు డ్రైవ్ చేసినా.. మీకు తెలిసిన వారు డ్రైవ్ చేస్తున్నా.. వారితో పాటు ఆధార్ కార్డు ఉందా? లేదా? అన్నది ఒక్కసారి చెక్ చేసుకోండి. లేదంటే.. అనవసరమైన చిక్కుల్లో పడటం ఖాయం.