Begin typing your search above and press return to search.

శిశువుకు ఆస్పత్రి నుంచే ఆధార్.. సంస్థ సన్నాహాలు..!

By:  Tupaki Desk   |   17 Dec 2021 5:00 PM IST
శిశువుకు ఆస్పత్రి నుంచే ఆధార్.. సంస్థ సన్నాహాలు..!
X
మనదేశంలో వ్యక్తి గుర్తింపునకు ఆధార్ తప్పనిసరి. ఈ కార్డు ఉంటే చాలు భారతీయుడిగా దేశంలో ఎక్కడైనా గుర్తింపు ఉంటుంది. ప్రస్తుతం దేశంలోని ప్రజలందరికీ ముఖ్యమైన ఐడెంటిటీ ఇదే.

స్కూల్ అడ్మిషన్ల నుంచి మొదలుకుంటే ఓటు హక్కు వినియోగించేదాకా ఆధార్ అవసరం. ప్రస్తుతం ఏడాది దాటిన పిల్లలందరికీ ఈ కార్డును జారీ చేస్తున్నారు. అయితే తాజాగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఏడాది దాటిన పిల్లలకు ఇస్తున్న ఆధార్ ను... ఇకపై అప్పుడే పుట్టిన శిశువులకు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆస్పత్రి నుంచే ఆధార్ నంబర్ ఇవ్వడానికి వీలయ్యే మార్గాలను ఆలోచిస్తున్నట్లు యూఐడీఏఐ సీఈవో సౌరభ్ గార్గ్ వెల్లడించారు.

బిడ్డ పుట్టగానే ఒక్కక్లిక్ తో ఆధార్ ను జారీ చేసే అవకాశంపై రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్ విభాగంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. దీనిపై అతిత్వరలో క్లారిటీ ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు.

ఆధార్ లో కీలకంగా భావించే వేలిముద్రలు గట్రా అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఎలా తీసుకుంటారనే సందేహం కలుగక మానదు. అయితే దీనిపై కూడా సంస్థ సీఈవో స్పందించారు. ఎలాగూ ఐదేళ్లలోపు చిన్నారుల నుంచి వేలిముద్రల గుర్తింపు, ఐబాల్ ఐడెంటిటీ వంటివి అవసరం లేదు కాబట్టి పెద్ద సమస్య ఉండదని అన్నారు.

అయితే చిన్నారి ఆధార్ కు వారి తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్ నంబరును జతచేయనున్నట్లు పేర్కొన్నారు. ఐదేళ్లు దాటిన తర్వాత బయోమెట్రిక్ డీటెయిల్స్ ను అప్ డేట్ చేయవచ్చునని చెప్పారు.

దేశంలో ఏ సంక్షేమ పథకం అందాలన్నా... ఎక్కడకు పోవాలన్నా... ఏ పని చేయాలన్నా కూడా ఆధార్ తప్పనిసరి అయింది. కాగా దేశంలో ఇప్పటికే 99.7శాతం మందికి ఆధార్ జారీ చేసినట్లు సంస్థ సీఈవో వెల్లడించారు.

అంటే దాదాపు 137 కోట్ల మందికి ఆధార్ గుర్తింపు ఉంది. కాగా ఏటా రెండున్నర కోట్ల మంది పిల్లలు జన్మిస్తున్నారని సౌరభ్ గార్గ్ వెల్లడించారు.

ఈ నేపథ్యంలో శిశువుకు ఆస్పత్రిలో ఆధార్ జారీ చేయడానికి సన్నాహాలు షురూ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ విధంగా అప్పుడే పుట్టిన శిశువు... ఆస్పత్రి నుంచే ఆధార్ గుర్తింపును పొందవచ్చన్నమాట