Begin typing your search above and press return to search.

తొలిసారి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న శివ‌సేన‌!

By:  Tupaki Desk   |   13 Jun 2019 1:45 PM GMT
తొలిసారి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న శివ‌సేన‌!
X
రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు అనుగుణంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌టం ఒక ఎత్తు. మొత్తం స‌మీక‌ర‌ణాలు మారిపోయేలా నిర్ణ‌యాలు తీసుకోవ‌టం మ‌రో ఎత్తు. తాజాగా శివ‌సేన రెండో దారిని ఎంచుకుంది. మొద‌ట్నించి బీజేపీతో జ‌ట్టుక‌ట్టి.. ఆ పార్టీతో క‌లిసి ప్రయాణం చేసిన శివ‌సేన తొలిసారి సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకుంది. బీజేపీకి న‌మ్మ‌క‌మైన మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న సేన‌.. తాజాగా బీజేపీ నేత‌లు ఊహించ‌ని తీరులో నిర్ణ‌యం తీసుకున్నారు.

శివ‌సేన చీఫ్ ఉద్ధ‌వ్ థాక‌రే కుమారుడు ఆదిత్య థాక‌రేను మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లుగా స‌మాచారం. అధికారికంగా ఈ స‌మాచారాన్ని వెల్ల‌డించ‌న‌ప్ప‌టికీ.. ఈ దిశ‌గా పార్టీ ఆలోచిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. కొద్ది నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో శివ‌సేన ఈసారి మ‌హారాష్ట్ర అధికారాన్ని సొంతం చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

దీనికి తోడు ఇటీవ‌ల వెల్ల‌డైన ఎన్నిక‌ల ఫ‌లితాల్లో శివ‌సేనకు పెద్ద ఎత్తున ఓట్లు ప‌డ‌టం కూడా పార్టీ ఆలోచ‌న‌ల్లో మార్పు రావ‌టానికి కార‌ణంగా చెబుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. 53 ఏళ్ల శివ‌సేన చ‌రిత్ర‌లో ఇంత‌వ‌ర‌కు ఎవ‌రూ థాక‌రే కుటుంబం నుంచి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. 28 ఏళ్ల ఆదిత్య థాక‌రే ప్ర‌స్తుతం పార్టీలో కీల‌క భూమిక పోషిస్తున్నారు.

త‌న తాత ఏర్పాటు చేసిన శివ‌సేన పార్టీలో అత్య‌ధిక సంఖ్య‌లో సీట్లు గెలుసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఆదిత్య ఉన్న‌ట్లు చెబుతున్నారు. వీలైనంత ఎక్కువ‌మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవ‌ట‌మే ల‌క్ష్య‌మ‌ని చెబుతున్నారు. మ‌రి.. మిత్రుడు శివ‌సేన ఆలోచ‌న‌ల‌కు బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. శివ‌సేన త‌న సీఎం అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తే.. మిత్రులుగా ఉన్న బీజేపీ.. శివ‌సేన‌లు ఎవ‌రెన్ని సీట్ల‌లో పోటీ చేయాల‌న్న‌ది ఒక ప్ర‌శ్న‌. దీనికి సంబంధించిన నిర్ణ‌యాల్ని మోడీషాలే నిర్ణ‌యించాల్సి ఉంటుంది. త‌మ చేతిలో ఉన్న మ‌హా ప‌గ్గాల్ని సేన చేతుల్లో పెట్ట‌టానికి బీజేపీ సిద్ధంగా ఉంద‌న్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. ఏమైనా.. సేన తీసుకున్న‌ట్లుగా చెబుతున్న నిర్ణ‌యం నిజ‌మైన ప‌క్షంలో మ‌హారాష్ట్ర రాజ‌కీయ వాతావ‌ర‌ణం మార‌ట‌మే కాదు.. కొత్త స‌మీక‌ర‌ణాలు తెర మీద‌కు రావ‌టం ఖాయ‌మని చెప్ప‌క‌తప్ప‌దు.