Begin typing your search above and press return to search.

ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వలేదని సెల్‌ టవర్‌ ఎక్కిన నాయకుడు!

By:  Tupaki Desk   |   14 Nov 2022 3:29 AM GMT
ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వలేదని సెల్‌ టవర్‌ ఎక్కిన నాయకుడు!
X
సాధారణంగా తమ డిమాండ్లు నెరవేర్చుకోవడానికి ప్రజలు చెట్లు, సెల్‌ టవర్లు ఎక్కి బెదిరించడం చూస్తూనే ఉంటాం. అధికారులు తమ డిమాండ్‌ నెరవేర్చకపోతే దూకి చస్తానని బెదిరిస్తూ ఉంటారు. ఇక అబ్బాయిలు తాము ప్రేమించిన అమ్మాయి తమను ప్రేమించకపోతే దూకి చస్తామని బెదిరిస్తుంటారు.

ఇప్పుడు ఇదే కోవలో ఒక నాయకుడు తనకు టికెట్‌ ఇవ్వకపోతే దూకి చస్తానంటూ సెల్‌ టవర్‌ ఎక్కి అందరినీ ఆందోళనకు గురిచేశాడు. ఈ ఘటన వివరాల్లోకెళ్తే.. ప్రస్తుతం ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ మాజీ కౌన్సిలర్‌ హసీబ్‌–ఉల్‌–హసన్‌ టికెట్‌ ఆశించారు.

అయితే ఆయనకు ఆమ్‌ ఆద్మీ పార్టీ టికెట్‌ ఇవ్వలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన హసీబ్‌ ఉల్‌ హసన్‌ ఢిల్లీలోని శాస్త్రి పార్క్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలోని ఓ ట్రాన్స్‌మిషన్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలియజేశారు.

తనకు టికెట్‌ ఇవ్వకపోతే దూకి చస్తానంటూ బెదిరించాడు. దీంతో అటుగా వెళ్తున్న ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

డిసెంబర్‌ 4న జరగనున్న ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండవ, తుది విడత జాబితాలో 117 మంది అభ్యర్థుల పేర్లను ఆమ్‌ ఆద్మీ పార్టీ నవంబర్‌ 13న ప్రకటించింది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 14న తాజా ఘటన చోటుచేసుకుంది.

కాగా ప్రజావాణి ద్వారా సర్వేలో ప్రజలు సూచించినవారికే పార్టీ టికెట్లు ఇచ్చామని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటించింది. సర్వేలో ప్రజలు సూచించిన పార్టీ పాత కార్యకర్తలకే రెండో జాబితాలో చోటు కల్పించినట్టు తెలిపింది. టిక్కెట్ల పంపిణీలో పార్టీ కోసం కష్టపడిన 117 మందికి పైగా పాత కార్యకర్తలకు టిక్కెట్లు ఇచ్చినట్టు వెల్లడించింది. టిక్కెట్‌ను ఆశిస్తూ ఏకంగా 20,000 మందికి పైగా ఆప్‌ కార్యకర్తలు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.