Begin typing your search above and press return to search.

గుజరాత్ పై ఆప్ కన్ను

By:  Tupaki Desk   |   3 April 2022 8:31 AM GMT
గుజరాత్ పై ఆప్ కన్ను
X
పంజాబ్ లో సాధించిన అద్భుతమైన విజయంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భవిష్యత్తులో పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ఏడాది చివరలో ఎన్నికల్లో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో గట్టి ప్రభావం చూపించాలని బాగా పట్టుదలగా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ విషయాన్ని పక్కనపెట్టేస్తే ముందు గుజరాత్ పై ప్రత్యేక దృష్టి సారించినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే గుజరాత్ లో రెండు రోజుల పాటు రోడ్డు షోలు నిర్వహిస్తున్నారు.

అహ్మదాబాద్ లో శనివారం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవాన్ సింగ్ మాన్ ఆధ్వర్యంలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఆదివారం కూడా రోడ్డు షో నిర్వహించబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టి అధికారంలోకి వచ్చేయాలని కేజ్రీవాల్ ఏమీ ఆశపడటం లేదు. అది జరగని పనని కేజ్రీకి బాగా తెలుసు. అయితే ఎన్నికల్లో జనాలపై గట్టి ముద్ర వేస్తే రాబోయే రోజుల్లో అధికారంలోకి రావటం పెద్ద కష్టం కాదనేది కేజ్రీ ఆలోచనగా ఉంది.

ఇప్పటికే సూరత్, అహ్మదాబాద్ లాంటి మూడు నాలుగు మున్సిపాలిటీల్లో ఆప్ తరఫున ఇద్దరు, ముగ్గురు కార్పొరేటర్లున్నారు. దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్న బీజేపీని కాదని కొన్ని మున్సిపాలిటీల్లో జనాలు ఆప్ అభ్యర్ధులను కార్పొరేటర్లుగా గెలిపించుకున్నారంటేనే మార్పు కోరుకుంటున్నట్లు అర్ధమవుతోంది. ఈ పాయింట్ ఆధారంగానే కేజ్రీవాల్ రాబోయే ఎన్నికల్లో పోటీచేయాలని డిసైడ్ చేశారు. పంజాబ్ ఎన్నికల్లో కూడా ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీతోనే మొదలుపెట్టి చివరకు అసెంబ్లీపై జెండా ఎగరేశారు.

కేజ్రీవాల్ ప్లాన్ ఏమిటంటే కాంగ్రెస్ ఎక్కడైతే అధికారంలో లేదా ప్రధాన ప్రతిపక్షంగా ఉందో ఆయా రాష్ట్రాల్లో జనాలకు ఆప్ మాత్రమే ప్రత్యామ్నాయంగా కనబడేట్లు చేయాలి. ఈ సూత్రం మీదే ముందు ఢిల్లీలోను తర్వాత పంజాబ్ లోను అధికారం అందుకున్నారు. మొన్న జరిగిన యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఎన్నికల్లో కూడా కొన్నిచోట్ల పోటీ చేసినా జనాల మనస్సుల్లో ఆప్ రిజిస్టర్ అయ్యేందుకు మాత్రమే కేజ్రీ ప్రయత్నించారు. గుజరాత్ ఎన్నికల్లో జనాలు ఆప్ ను ఏమేరకు ఆదరిస్తారో చూడాల్సిందే.