Begin typing your search above and press return to search.

అమీర్ ను ఏ రేంజ్ లో ఏసుకున్నారంటే..?

By:  Tupaki Desk   |   25 Nov 2015 5:03 AM GMT
అమీర్ ను ఏ రేంజ్ లో ఏసుకున్నారంటే..?
X
బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ చేసిన అసందర్భ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. ప్రముఖులు మొదలు.. సామాన్యులు వరకూ అమీర్ వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్.. వామపక్షనేతలు.. ఇలా కొన్ని పార్టీ నేతలు మినహా మిగిలిన వారంతా అమీర్ వ్యాఖ్యల్ని తప్పు పడుతున్నారు. అదే సమయంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ లాంటివారు సైతం అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడటం.. రాజకీయంగా మార్చే అలవాటున్న రాహుల్ గాంధీ.. అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారు అమీర్ ఖాన్ మాటలకు మద్దతు పలుకుతూ తమ రాజకీయ పరిణితిని ప్రదర్శిస్తున్నారు.

రాజకీయ నాయకులు.. సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వారి సంగతి పెట్టేసి సామాన్యులు ఏమంటున్నారు? ఎలా రియాక్ట్ అవుతున్నారన్న విషయాన్ని చూస్తే.. అమీర్ వ్యాఖ్యలపై ఎంతటి వ్యతిరేకత వ్యక్తమవుతుందో ఇట్టే చెప్పేయొచ్చు. పెరిగిన సాంకేతికత పుణ్యమా అని.. సోషల్ నెట్ వర్క్ కారణంగా ఈ రోజు ఏ విషయాన్ని దాచలేని పరిస్థితి. గతంలో ఏదైనా వివాదం చెలరేగినప్పుడు దేశ ప్రజలు ఏమనుకుంటున్నారన్నది మీడియాలో వచ్చే వార్తల ఆధారంగా ఉండేది. కానీ.. మారిన కాలంతో పాటు.. అందుబాటులోకి వచ్చిన సోషల్ నెట్ వర్క్స్ కారణంగా ఎవరికి వారు తమ అభిప్రాయాన్ని నేరుగా చెప్పేస్తున్నారు.

ప్రముఖుడు కాకున్నా.. ఒక సామాన్యుడు చెప్పే మాటలు నచ్చితే.. వాటిని పలువురు మద్దతు పలకటం లాంటివి సోషల్ మీడియాతో సాధ్యమవుతున్నాయి. దేశంలో మత అసహనం పెరుగుతుందని.. ఈ కారణంగా తాము ఒక దశలో దేశం విడిచి వెళ్లిపోవాలని తన భార్య కిరణ్ రావ్ చెప్పిందంటూ అమీర్ చేసిన వ్యాఖ్యలపై సామాన్యుల స్పందన షాకింగ్ ఉందని చెప్పాలి. అమీర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే స్నాప్ డీల్ యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేసుకోవాలని.. తాను అదే పని చేశానంటూ వచ్చిన ఒక ట్వీట్ దాదాపు లక్ష మంది వరకూ ఒక్క మంగళవారం నాడు యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేసిందన్న మాట వినిపిస్తోంది. అధికారికంగా ఈ సమాచారం రానప్పటికీ.. ఒక అంచనా ప్రకారం ఇంత భారీగా అన్ ఇన్ స్టాల్స్ జరిగినట్లుగా చెబుతున్నారు.

ఇవే కాదు.. అమీర్ వ్యాఖ్యలపై సాదాసీదా ప్రజలు.. సామాన్యులు ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు చూస్తే.. అమీర్ మాట.. దేశ ప్రజల మనసుల్ని ఎంతగా నొప్పించిందో ఇట్టే అర్థమవుతుంది. అలాంటి కొన్ని ట్వీట్స్ చూస్తే..

‘‘నా దగ్గర పెద్దగా డబ్బుల్లేవు. కానీ.. అమీర్ ఖాన్ భార్య ఏ దేశం వెళ్లానుకున్నారో చెబితే.. ఆమెకు ఉచితంగా విమాన టిక్కెట్లు కొనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’’

‘‘అమీర్ కారణంగా స్నాప్ డీల్ యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేశా. ఇక నుంచి.. స్నాప్ డీల్ నుంచి ఇంకేం కొనను’’

‘‘అమీర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న స్నాప్ డీల్.. టాటా స్కై.. టైటాన్ వాచ్.. కోకోకోలా ఉత్పత్తుల్ని బాయ్ కాట్ చేస్తున్నా’’

‘‘అమీర్ ఖాన్ లేకుండా దేశం బతకగలదు. బహుశా అతను లేకుండా భారత్ మరింత అభివృద్ధి చెందుతుంది. కానీ.. భారతమాత లేకుండా.. ఆమె ఆశీస్సులు లేకుండా మాత్రం అమీర్ మనుగడ సాధించలేడు’’

‘‘ఈ రోజు నుంచి అమీర్ నటించిన సినిమాలు చూడొద్దని నిర్ణయించుకున్నా’’

‘‘మన హీరో అనుకున్న వ్యక్తి గురించి ఇప్పుడు అందరూ పునరాలోచించండి’’

‘‘అమీర్ ఖాన్ ను అసహనంతో ఉన్న పాకిస్థాన్ ఆహ్వానించినట్లుంది. హిందూస్థాన్ ను విడిచి పెట్టటానికి ఇదే అతనికి సరైన సమయం’’

‘‘టీవీల్లో అతిథి దేవో భవ’ అని అంటారు. విదేశీయుల్ని భారత్ ను సందర్శించమని చెబుతారు. కానీ.. ఆయన మాత్రం దేశం విడిచి వెళ్లాలని ఉంది. ఇది సరికాదు’’

‘‘అమీర్ ఖాన్ నీకు విమానం టిక్కెట్లను నేను స్పాన్సర్ చేస్తా. నువ్వు వెళ్లాలనుకున్న దేశం పేరు చెప్పు. నిన్ను ఈ దేశం నుంచి ఆనందంగా పంపించేస్తా’’