Begin typing your search above and press return to search.

ఇప్పటికి పెళ్లాన్నే సమర్థిస్తున్నాడే?

By:  Tupaki Desk   |   6 March 2016 10:14 AM IST
ఇప్పటికి పెళ్లాన్నే సమర్థిస్తున్నాడే?
X
మిస్టర్ పర్ ఫెక్ట్ గా పేరు.. ఎవరూ ఎలాంటి విమర్శ చేసేందుకు అవకాశం ఇవ్వని బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ చేజేతులారా ఒక విషయంలో కామెంట్ చేసి అడ్డంగా బుక్ కావటం తెలిసిందే. అసహనం అట్టుడిగిపోతుందన్నట్లుగా ప్రచారం చేసిన రాజకీయ పార్టీల ప్రభావంలో పడిన అమీర్ ఖాన్ దంపతులు ఈ విషయంపై తమ మధ్య సాగిన సంభాషణను మీడియాతో చెప్పి మరీ బుక్ కావటం అమీర్ కే చెల్లుతుంది.

దేశంలోని అసహన పరిస్థితుల నేపథ్యంలో.. తన భార్య తనను దేశం విడిచి వెళ్లాలని కోరిందంటూ చెప్పిన వ్యాఖ్యలు దేశ ప్రజల్ని మండిపోయేలా చేసింది. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వెల్లవెత్తాయి. అతని వ్యాఖ్యలు ఏ మాత్రం సరికాదన్న వాదన బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యల్ని సర్ది చెప్పుకున్న అమీర్ ఖాన్.. తనకు అవకాశం వచ్చిన ప్రతిసారీ ఈ ఇష్యూను ప్రస్తావించి.. నష్టనివారణ చేపట్టే పని మొదలెట్టారు. అయితే.. నోట జారిన మాటకు సంతృఫ్తికరంగా సమాధానం ఇవ్వని అమీర్ ఖాన్.. తాజాగా ఇదే అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చి బుక్ అయినట్లుగా కనిపిస్తోంది.

ఓ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా ప్రభుత్వం తనను తొలగించినా.. తాను ఆ బ్రాండ్ కి అంబాసిడర్ గా కొనసాగాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ‘‘నా దేశం నాకు అమ్మతో సమానం. అంతే తప్ప ఒక బ్రాండ్ కాదు. తల్లిని బ్రాండ్ అనే భావనతో నేనెప్పుడూ చూడలేదు’’ అని వ్యాఖ్యానించారు. ఇక.. తాను చేసిన వ్యాఖ్యల్లో కొన్ని మాటల్ని తప్పుగా ప్రచురించినట్లుగా మీడియా మీద పడ్డ అమీర్.. తాను అసహన దేశం అన్న మాట అనలేదని.. దేశంలో అసహనం ఉత్పన్నమవుతుందని మాత్రమే అన్నానని.. కానీ.. అందరూ తప్పుగా అర్థం చేసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా అమీర్ భార్య కిరణ్ వ్యాఖ్యల్ని ప్రస్తావించగా.. కిరణ్ దేశం విడిచి వెళ్లదని.. ఈ దేశంలోనే పుట్టింది.. ఇక్కడే తుదిశ్వాస విడుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎంతైనా కిరణ్ ఒక తల్లి కదా.. పిల్లలపై తల్లికి ఆందోళన ఉండటం సహజమే కదా అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. నిజమే.. పిల్లలకు తల్లి మీద ప్రేమను ఎవరూ కాదనలేదు. కానీ.. అదే తల్లి (కిరణ్ భార్య).. తన తల్లిలాంటి భారతమాత ప్రతిష్ఠను దెబ్బ తీసేలా మాట్లాడకూడదు కదా? దేశంలో లేని దాని గురించి లేనిపోని ఆందోళనలు వ్యక్తం చేసి.. కోట్లాదిమందిని తప్పుదారి పట్టించకూడదు కదా? చేసిన తప్పునకు లెంపలేసుకునే దానికి.. మళ్లీ కెలికి ఇష్యూను మరింత పెద్దది చేసుకోవటం అవసరమా? అయినా.. తల్లి లాంటి భారత్ మీద గతంలో అసహనం ఎందుకు ప్రదర్శించినట్లో..?