Begin typing your search above and press return to search.

మోడీ బట్టల కంటే కేజ్రీ ప్రచార ఖర్చు తక్కువేనట..

By:  Tupaki Desk   |   30 Jun 2016 12:20 PM GMT
మోడీ బట్టల కంటే కేజ్రీ ప్రచార ఖర్చు తక్కువేనట..
X
ఇటీవల కాలంలో ఢిల్లీ సీఎం - ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా పత్రికలు - ఛానళ్లలో భారీగా ప్రకటనలిస్తున్నారు. అదేదే కేవలం ఢిల్లీకో - ఉత్తర్ ప్రదేశ్ కో.. లేదంటే వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న పంజాబ్ కో పరిమితం కాలేదు. ఆయన దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోని మీడియాకు ప్రకటనలిస్తున్నారు. దీంతో అవినీతిని అంతం చేస్తామంటూ ఢిల్లీలో అధికార పగ్గాలు దక్కించుకున్న కేజ్రీవాల్ కూడా మామూలు రాజకీయ నాయకుడిలా మారిపోయారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆయనకు బద్ధ విరోధి అయిన బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

దీంతో బీజేపీ విమర్శలను తట్టుకునేందుకు కేజ్రీ తన నోటికి పనిచెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. కేవలం తన ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసుకునేందుకు కేజ్రీ సర్కారు ఏకంగా రూ.526 కోట్లను వెచ్చించిందన్న వార్తలను కేజ్రీ తిప్పికొట్టారు. ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసేందుకు తమ ప్రభుత్వం ఖర్చు చేసిన వ్యయం కేవలం రూ.76 కోట్లు మాత్రమేనని ఆయన చెప్పారు. ఇది నరేంద్ర మోడీ రెండేళ్ల కాలంలో వేసుకున్న దుస్తుల ఖర్చు కంటే చాలా తక్కువని అన్నారు.

ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఒక్కొక్కటి రూ.2 లక్షల విలువ ఉన్న డ్రెస్ లను వేసుకుంటున్న మోడీ ఒకసారి వేసుకున్న డ్రెస్ ను రెండో దఫా వాడటం లేదని కేజ్రీ ఆరోపించారు. ఈ లెక్కన 700 రోజుల పాలనను పూర్తి చేసుకున్న మోదీ రోజుకు రూ.10 లక్షల చొప్పున కేవలం డ్రెస్సులకే రూ.70 కోట్లు తగలేశారని ఆరోపించారు. ఇక ఇతర దుస్తుల ఖర్చు రూ.5 కోట్ల మేర ఉంటుందని చెప్పిన కేజ్రీ ప్రధాని కేవలం రెండేళ్లలో తన దుస్తుల కోసం రూ.75 కోట్లను తగలేశారని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రధాని మార్చిన దుస్తుల ఖరీదు ముందు తమ ప్రభుత్వ ప్రచారానికైన ఖర్చెంత? అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఆమ్ ఆద్మీ ఆరోపణలపై బీజేపీ ఎలా రెస్పాండవుతుందో చూడాలి.