Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల‌పై ఆప్ గురి

By:  Tupaki Desk   |   13 March 2022 2:30 AM GMT
తెలుగు రాష్ట్రాల‌పై ఆప్ గురి
X
మొన్న‌టి వ‌ర‌కూ ఒక రాష్ట్రంలోనే అధికారంలో ఉండి.. ప్రాంతీయ పార్టీగా కొన‌సాగిన ఆమ్ఆద్మీ పార్టీ ఇప్పుడు ఇప్పుడు ఓ జాతీయ పార్టీగా మారింది. పంజాబ్‌లో ఘ‌న విజ‌యంతో సంచ‌ల‌నం సృష్టించింది. దేశంలో ప్ర‌స్తుతం బీజేపీ, కాంగ్రెస్ కాకుండా రెండు రాష్ట్రాల్లో అధికారం ద‌క్కించుకున్న మూడో పార్టీ ఆప్ చ‌రిత్ర సృష్టించింది.

జాతీయ రాజ‌కీయాల్లో కాంగ్రెస్ స్థానాన్ని భ‌ర్తీ చేసి.. బీజేపీకి పోటీనివ్వ‌గ‌ల సామ‌ర్థ్యం ఆప్‌కు మాత్ర‌మే ఉంద‌నే విశ్లేష‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదే జోరుతో దేశంలోని మిగ‌తా రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు ఆప్ క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఆ క్ర‌మంలో తెలుగు రాష్ట్రాల‌పైనా ప్ర‌త్యేక దృష్టి సారించింది.

పాద‌యాత్ర‌ల‌తో షురూ..

రాజ‌కీయాల్లో నేత‌ల పాద‌యాత్ర‌లు మామూలే. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే వాటికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. ప్ర‌జ‌ల‌కు ఆక‌ట్టుకోవ‌డానికి పాద‌యాత్ర అనేది ఎంతో ముఖ్య‌మ‌ని భావించే నాయ‌కులు త‌ర‌చూ పాద‌యాత్ర‌లు చేస్తున్నారు. ఇప్పుడు ఆప్ కూడా మొద‌ట ఇదే దారిలో ప్ర‌యాణించాల‌ని చూస్తోంది. తెలంగాణ‌లోనూ పంజాబ్ ప‌రిస్థితులే ఉన్నాయ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వం అవినీతిలో కూరుకుపోయింద‌ని తాజాగా ఆప్ రాష్ట్ర వ్య‌వ‌హారాల బాధ్యుడు సోమ‌నాథ్ భార‌తి పేర్కొన్నారు.

తెలంగాణ‌లో ఆప్‌ను విస్త‌రించాల‌ని చూస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డం లేద‌ని, నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు చేశారు. టీఆర్ఎస్‌లో ప్ర‌జాస్వామ్యం లేద‌ని ఆ పార్టీ నేత‌లు ఆప్‌లోకి రావాల‌ని ఆయ‌న కోరారు.

ఏపీలో స‌ర్వేలు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ పార్టీని విస్త‌రించే ప్ర‌య‌త్నాల‌ను ఆప్ ముమ్మ‌రం చేసింది. ఇప్ప‌టికే అక్క‌డి ప‌రిస్థితుల‌పై స‌ర్వేలు నిర్వ‌హించిన‌ట్లు తెలిసింది. అక్క‌డ రాజ‌కీయ ప‌రిణామాల‌పై పూర్తి అంచ‌నా వ‌చ్చాక బ‌రిలో దిగేందుకు సిద్ధమ‌వుతున్న‌ట్లు స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ, జ‌న‌సేన లాంటి పార్టీల‌తో పొత్తు పెట్టుకుని లేదంటే ఒంట‌రిగానే పోటీ చేసేందుకు ఆప్ ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్న‌ట్లు టాక్‌.

మ‌రోవైపు అంబేడ్క‌ర్ జ‌యంతి రోజైన ఏప్రిల్ 14 నుంచి తెలుగు రాష్ట్రాలతో స‌హా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర‌లు ప్రారంభించేందుకు ఆ పార్టీ క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆ పాద‌యాత్ర‌ల ద్వారా అక్క‌డి ప‌రిస్థితుల‌పై పార్టీకి అనుకూలించే విష‌యాల‌పై ఓ అంచ‌నాకు వ‌చ్చే అవ‌కాశం ఉంది.