Begin typing your search above and press return to search.

బీజేపీని షేక్ చేసిన అతనే గుజరాత్ కాబోయే సీఎం...?

By:  Tupaki Desk   |   5 Nov 2022 11:31 AM GMT
బీజేపీని షేక్ చేసిన అతనే గుజరాత్ కాబోయే సీఎం...?
X
గుజరాత్ అంటే బీజేపీ. బీజేపీ అంటే గుజరాత్. ఇది మూడు దశాబ్దాలుగా వినిపిస్తున్న మాట. బీజేపీ గుజరాత్ లో ఎందుకు అంతలా పాతుకుపోయింది అంటే దానికి చాలా లెక్కలు ఉన్నాయి. గుజరాత్ హిందూత్వకు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే ప్రాంతం. అక్కడ గుళ్ళూ గోపురాలు భక్తిభావం చాలా ఎక్కువ. దాంతో బీజేపీకి పని సులువు అయింది. ఇక ఆరెస్సెస్ అయితే గుజరాత్ లో దాదాపుగా ఉన్న నాలుగున్నర కోట్ల మంది ప్రజానీకంతో డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకుంది. అంతలా ఒక రాజకీయ పార్టీ జనంతో అనుసంధానం కావడం దేశంలో ఎక్కడా జరిగి ఉండదు.

బీజేపీకి గుజరాత్ లో పట్టు ఎలా వచ్చింది అంటే 1977లో కేంద్రంలో జనతా పార్టీ ఏర్పడింది. ఆ టైం లో దేశంలో చాలా చోట్ల జనతా ప్రభుత్వాలు వచ్చాయి. అలా ఫస్ట్ టైం జనసంఘ్ బలంగా ఉన్న జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఇక బీజేపీగా మారిన తరువాత మొదటి సారి గుజరాత్ లో పీఠం పట్టడానికి 18 ఏళ్ల సుదీర్ఘ సమయం పట్టింది. ఒకసారి గుజరాత్ అందలం ఎక్కిన తరువాత బీజేపీ తన కత్తికి ఎదురులేదని చాటుకుంటూ ఇప్పటికి 27 ఏళ్ళుగా అధికారంలో ఉంది.

అయితే ఫస్ట్ టైం ఒక సామాన్యమైన జర్నలిస్ట్ నుంచి బీజేపీకి అధికార ముప్పు పొంచి ఉందని అంటున్నారు. ఆ సామాన్య జర్నలిస్ట్ ఏవరో కాదు ఆప్ తరఫున ఎంపిక అయిన కాబోయే సీఎం క్యాండిడేట్. ఆప్ పంజాబ్ లో చేసినట్లుగానే జనం నుంచి తమ సీఎం క్యాండిడేట్ ని సెలెక్షన్ చేసుకుంది. పంజాబ్ లో అది ఫలించి భగవంత్ సింగ్ సీఎం అయ్యారు. ఇపుడు కూడా ఆప్ గుజరాత్ ప్రజలకే అవకాశం ఇచ్చింది. తమ పార్టీ నుంచి సీఎం క్యాండిడేట్ ఎవరు అన్నది జనాలే చెప్పాలని పోల్ కండక్ట్ చేసింది.

దీంతో లో ఆప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న 40 ఏళ్ల టీవీ యాంకర్ ఇసుదాన్ గఢ్వీ ఎన్నికయ్యాడు. ఆయనకు మద్దతుగా 73 శాతం మంది ప్రజలు ఓట్లేశారు. ఆయనతో పోటీ పడిన గుజరాత్ ఆప్ ప్రెసిడెంట్ గోపాల్ ఇటాలికాకు 20 శాతం మంది మాత్రమే మద్దతు ఇచ్చారు. దీంతో ఆయన పేరునే తమ సీఎం అభ్యర్ధిగా కేజ్రీవాల్ ప్రకటించి అందరికీ షాక్ తినిపించారు. ఈ టీవీ యాంకర్ కం జర్నలిస్ట్ గఢ్వీ గురించి చూస్తే అతి సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ లో మాస్టర్ డిగ్రీ చేశాడు.

ప్రభుత్వ చానల్ దూరదర్శన్ నుంచే ఆయన తన కెరీర్ స్టార్ట్ చేశాడు. ఇక 2007 నుంచి 2011 దాకా గుజరాత్ ఈటీవీ చానల్ కి జర్నలిస్ట్ గా పనిచేసిన గఢ్వీ బీజేపీ సర్కార్ కి సంబంధించిన అనేక కుంభకోణాలను బయట పెట్టి ప్రభుత్వాన్ని షేక్ చేసి పారేశాడు. అలా టోటల్ గుజరాత్ లోనే పాపులర్ జర్నలిస్ట్ గా డేరింగ్ అండ్ డేరింగ్ మీడియా పర్సన్ గా పేరు తెచ్చుకున్నాడు. అన్నింటికీ మించి నిజాయతీపరుడు అవినీతి మచ్చ లేనివాడుగా గఢ్వీకి పేరుంది. పైగా 48 శాతం ఉన్న ఓబీసీ సామాజికవర్గానికి చెందిన నేత. దాంతోఆ సామాజికవర్గం పరంగా కూడా ఆప్ కి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది మరి.

బహుశా ఇదే అతన్ని కాబోయే సీఎం గా జనాంలో ప్రోజెక్ట్ చేసి ఉంటుంది అనుకోవాలి. ఒక విధంగా బీజేపీ 27 ఏళ్ల వరసపాలనతో విసిగి ఉన్న జనాలకు గఢ్వీ కరెక్ట్ ప్రత్యర్ధిగా చెప్పాలి. ఆయన జర్నలిస్ట్ కూడా కావడంతో బీజేపీ ఏలుబడిలో తప్పులను అవినీతిని జనాల్లోకి బాగానే తీసుకెళ్ళే చాన్స్ ఉంది. దాంతో పాటు యువకుడు, నిజాయతీ పరుడు, పొలిటికల్ గా ఫ్రెష్ లుక్ కావడంతో సంచలనాలు నమోదు చేస్తారా అన్న చర్చ ఉంది. ఆప్ కూడా నిజాయతీతో కూడిన రాజకీయం అంటూ గుజరాత్ ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి చూస్తే కమలం పార్టీకి కరడు కట్టిన కలం యోధుడి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది అని చెప్పక తప్పదు అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.