Begin typing your search above and press return to search.

లగడపాటి తరువాత పార్లమెంటును వణికించింది ఈయనే..

By:  Tupaki Desk   |   22 July 2016 6:04 AM GMT
లగడపాటి తరువాత పార్లమెంటును వణికించింది ఈయనే..
X
ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందే సమయంలో అప్పటి కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పార్లమెంటులో పెప్పర్ స్ప్రే చల్లి హడావుడి చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటన ఇప్పటికీ సంచలనమే. తాజాగా ఆప్ ఎంపీ ఒకరు అంతేస్థాయిలో సంచలనానికి తెరతీశారు. ఆయన తీసిన ఓ వీడియో ఇప్పుడు పెను వివాదానికి దారి తీసింది. తన ఇంటి నుంచి పార్లమెంట్‌ లోకి ప్రవేశించే వరకు వీడియో చిత్రీకరించిన భగవంత్‌ వ్యవహారం పార్లమెంటును కుదిపేసింది. దీంతో లోక్‌ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ ఎదుట ఆప్ ఎంపీ హాజరయ్యారు. వీడియో దృశ్యాలను సోషల్ మీడియాలో ఉంచడంపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భగవంత్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో లోక్ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడగా.. రాజ్యసభలో గందరగోళం నెలకొంది.

ఆప్ ఎంపీ భగవంత్ తన ఇంటి నుంచి బయలుదేరి పార్లమెంట్ లోపలికి వెళ్లే వరకు తన ఫోన్ తో వీడియో తీసాడు. కారులో కూర్చున్న ఎంపీ తన ఫోన్ ను స్విచ్ ఆన్ చేసి సెక్యూర్టీ ఏర్పాట్లను వీడియో తీశాడు. పార్లమెంట్ లో ప్రవేశిస్తున్న దృశ్యాలను కూడా వీడియో తీసాడు. ఇంటి నుంచి పార్లమెంట్ వరకు సెక్యూర్టీ ఎలా ఉందో చెబుతూ ఆ వీడియోకు కామెంట్రీ కూడా ఇచ్చాడు. అంతేకాదు ఆ వీడియోను ఫేస్ బుక్ లో లైవ్ అయ్యేలా చూశాడు. పార్లమెంట్ లో ఎంట్రీ అవుతుంటే ఓ సెక్యూర్టీ గార్డ్ ఆ ఎంపీని ఫోటోలు తీయరాదంటూ అడ్డుపడ్డాడు. అయితే తాను తీస్తున్న వీడియోను రహస్యంగా ఉంచనున్నట్లు సెక్యూర్టీకి తెలిపాడు ఆ ఎంపీ. అంతే కాదు ఒకవేళ లోక్ సభ స్పీకర్ తన పనని తప్పుగా భావిస్తే, దానికి సారీ చెప్పనున్నట్లు భగవంత్ అక్కడ చెప్పారు. రాజ్యసభలో భగవంత్ మాన్ అంశంపై చర్చించాలని సభ్యులు పట్టుపట్టారు. అయితే డిప్యూటీ చైర్మన్ కురియన్ సభ్యుల డిమాండ్ ను పక్కకు పెట్టారు. మాన్ లోకసభ సభ్యుడు కావడం వల్ల రాజ్యసభలో చర్చ కుదరదన్నారు. పార్లమెంట్ లో సెక్యూర్టీ కీలకాంశమని, కట్టుదిట్టమైన సెక్యూర్టీ ఏర్పాటు చేయడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రభుత్వం ఆ ఎంపీపై ఎటువంటి చర్యనైనా తీసుకోవచ్చు అని కురియన్ అన్నారు. భగవంత్ మాన్ తీసిన వీడియో తీవ్రవాదుల చేతుల్లో పడితే ఎవరు బాధ్యత వహిస్తారని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి - హరసిమ్రత్ బాదల్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తప్పనిసరిగా దర్యాప్తు చేయాలని.. పార్లమెంట్ కార్యకలాపాలను వీడియో తీయడం వెనుకున్న ఉద్దేశాన్ని వెల్లడి చేయాలని డిమాండ్ చేశారు. అయితే... జీవో అవర్ లో విపక్షాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు చూపించేందుకే వీడియో తీశానని భగవంత్ చెబుతున్నారు.