Begin typing your search above and press return to search.

116 మంది బీజేపీ ఎమ్మెల్యేల‌పై వేటేయండి

By:  Tupaki Desk   |   23 Jan 2018 3:18 PM GMT
116 మంది బీజేపీ ఎమ్మెల్యేల‌పై వేటేయండి
X
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20మంది ఎమ్మెల్యేలు అనర్హులయిన ఎపిసోడ్ మ‌లుపులు తిరుగుతోంది. లాభదాయక పదవుల వ్యవహారంలో వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల సంఘం చేసిన సిఫార్సును రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్ ఆదివారం ఆమోదించారు. ఈ మేరకు ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీలో 20మంది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటిస్తూ రాష్ట్రపతి అంగీకారంతో కూడిన నోటిఫికేషన్‌ ను న్యాయశాఖ విడుదల చేసింది. దీంతో ఖాళీ అయిన 20 శాసనసభ స్థానాల్లో ఉపఎన్నికలు అనివార్యం కానున్నాయి. అయితే ఈ ఎపిసోడ్‌ పై త‌మ రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ‌ను ఆప్ సిద్ధం చేసింది.

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వానికి ఏడుగురు మంత్రుల్ని నియమించుకునే అవకాశం ఉండగా, ప్రభుత్వం 2015లో అదనంగా 21మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించడం వివాదాస్పదమైంది. ఇది లాభదాయక పదవుల కిందకే వస్తుందంటూ ప్రశాంత్ పటేల్ అనే న్యాయవాది అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. 2016లోఆప్ ప్రభుత్వం వారిని పదవుల్లోంచి తొలిగించింది. అయితే ఆ అంశంపై వివరణ కోరిన రాష్ట్రపతికి ఎన్నికల సంఘం (ఈసీ) పార్లమెంటరీ కార్యదర్శి పదవులు లాభదాయక పదవుల కిందకే వస్తాయని శుక్రవారం స్పష్టంచేసింది. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయగా, మిగిలిన 20మందిని అనర్హులుగా ప్రకటిస్తూ.. ఈసీ చేసిన సిఫార్సులను రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్ ఆదివారం ఆమోదించారు.

రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్ ఢిల్లీలోని తమ 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన నేప‌థ్యంలో అధికార బీజేపీ లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ దాడికి దిగింది. మధ్యప్రదేశ్‌ లో లాభదాయక పదవుల్లో కొనసాగుతున్న 116 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. మధ్యప్రదేశ్‌ లో ఎమ్మెల్యేలు జన్ భగీరథి సమితి కాలేజీల్లో సభ్యులుగా ఉన్నారని ఆప్ ఎంపీల కన్వీనర్ అలోక్ అగర్వాల్ ఆరోపించారు. త‌మ ఎమ్మెల్యేల‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేసిన‌ట్లే..వారిపై కూడా వేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.