Begin typing your search above and press return to search.

సామాన్యుడి ప్రభుత్వం ఖర్చులు చుక్కల్లో

By:  Tupaki Desk   |   22 Jan 2016 9:38 AM GMT
సామాన్యుడి ప్రభుత్వం ఖర్చులు చుక్కల్లో
X
తమది సామాన్యుల పార్టీ అంటూ అదే పేరు పెట్టుకుని ఢిల్లీ రాష్ట్రాన్ని పాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అనవసర ఖర్చులతో ఆమ్ ఆద్మీపై భారం వేస్తోంది. ప్రచార ఆర్భాటానికి ఆ పార్టీ కోట్లలో ఖర్చు చేస్తోంది. కేవలం 11 నెలల్లో ఏకంగా 60 కోట్లు ఖర్చు చేసింది ఆప్ ప్రభుత్వం. పథకాల ప్రచారం కోసమంటూ టీవీలు, పత్రికలకు ఇబ్బడిముబ్బడిగా ప్రకటనలు ఇస్తూ ప్రజాధనం దుబారా చేస్తోందంటూ విపక్ష బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రచారానికి చేస్తున్న ఖర్చు వివాదాస్పదమవుతోంది. ఆర్భాటాలు, హంగులకు దూరమని... తమది సామాన్యుల ప్రభుత్వమని చెప్పే కేజ్రీవాల్ సర్కార్ కేవలం 11 నెలల కాలంలో ప్రచారం కోసం 60 కోట్లు ఖర్చు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇటీవల ప్రవేశపెట్టిన సరి బేసి సంఖ్యల విధానంపై ప్రచారానికి కూడా 2 కోట్లు ఖర్చు చేసిందట ఆప్ ప్రభుత్వం. అయితే... ఎన్ని విమర్శలొస్తున్నా కూడా ప్రచారం విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గరాదని కేజ్రీవాల్ అనుకుంటున్నారు. ఫిబ్రవరి 14న ఆప్ ప్రభుత్వ తొలి వార్షికోత్సవానికి కూడా భారీగా ఖర్చు చేయాలని భావిస్తున్నారట. అసలు కేజ్రీవాల్ ప్రచారం కోసం ఇంకా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలని అనుకుంటున్నా ఆయన టీం మాత్రం ఆ స్పీడు అందుకోలేకపోతుందని చెబుతున్నారు. బడ్జెట్లో సమాచార శాఖకు కేజ్రీవాల్ 526 కోట్లు కేటాయించారని.. కానీ, ఆప్ నేతలు మాత్రం అంత మొత్తం ప్రభుత్వ ప్రచారానికి ఖర్చు చేయలేకపోయారన్న వాదనా వినిపిస్తోంది.