Begin typing your search above and press return to search.

ఆమ్‌ఆద్మీపార్టీని తక్కువ అంచనా వేయొద్దు!

By:  Tupaki Desk   |   20 Jan 2015 9:06 AM GMT
ఆమ్‌ఆద్మీపార్టీని తక్కువ అంచనా వేయొద్దు!
X
భారతీయ జనతాపార్టీ వాళ్లు ఆమ్‌ ఆద్మీ పార్టీపై చేయగలిగిన విమర్శ ఏమైనా ఉందంటే.. అది కేజ్రీవాల్‌ పదవి నుంచి తప్పుకోవడంపై విరుచుకుపడటం మాత్రమే. ఎన్నికల నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీపై భారతీయ జనతా పార్టీ ఇంతకు మించి కేజ్రీవాల్‌ అండ్‌ కంపెనీపై దుమ్మెత్తిపోయడానికి ఏమీ లేకుండా పోయింది. అవినీతి, ఆశ్రితపక్షపాతం వంటి వ్యవహారాలను ఆయుధంగా చేసుకొని భారతీయ జనతా పార్టీ ఇది వరకూ కాంగ్రెస్‌పై విరుచుకుపడినంత ఈజీగా ఆప్‌ పడలేదు.

అలాంటి అస్త్రాలు ఆప్‌పై పోరాటానికి పెద్దగా ఉపయోగపడవు. సర్వేలు కూడా దాదాపు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఛానళ్లు నిర్వహిస్తున్న ఒపీనియన్‌ పోల్స్‌లో ఆప్‌ సత్తా చాటుతోంది. ఢిల్లీకి కేజ్రీవాలే ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని 47 శాతమంది మంది ప్రజలు కోరుకొంటున్నారట. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన కిరణ్‌ బేడీకి ఈ విషయంలో 44 శాతం మంది ప్రజల మద్దతు దక్కింది.

అయితే పార్టీ వారీగా చూసుకొంటే మాత్రం ఆమ్‌ ఆద్మీ కొంచెం వెనుకబడింది. ఒక సర్వే ప్రకారం ఢిల్లీలో 39 శాతం మంది ప్రజలు బీజేపీ వైపు మొగ్గుచూపుతుండగా ఆప్‌ పట్ల 34 శాతం మంది ఆదరణ కనబరుస్తున్నారు. ఈ శాతాలతో సీట్ల లెక్క గురించి ఒక అంచనాకు రాలేమని ఈ సర్వేయర్లు పేర్కొన్నారు.

మరో సర్వే ప్రకారం ఢిల్లీలో బీజేపీకి 34 నుంచి 40 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని ఆప్‌కు 25 నుంచి 31 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా. మరి స్థూలంగా చూస్తే.. ఈ ఎన్నికల్లో ఆప్‌ తన సత్తా చాటేలానే ఉంది!