Begin typing your search above and press return to search.

పంజాబ్ కేజ్రీవాల్ దేనట...

By:  Tupaki Desk   |   1 April 2016 11:00 AM GMT
పంజాబ్ కేజ్రీవాల్ దేనట...
X
ఢిల్లీలో అటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీజేపీని మట్టికరిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తాజాగా పంజాబ్లోనూ అదే సీను పునరావృతం చేస్తుందట. త్వరలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రస్తుత సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ లకు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ భారీ షాకివ్వనున్నారు. తాజాగా వెల్లడైన ‘హఫ్ పోస్టు-సీఓటర్’ సర్వేలో తేలింది. దాని ప్రకారం పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం చేపడుతుందని తేలింది. అది కూడా మామూలుగా కాదు... భారీ మెజారిటీతో అధికారాన్ని అందుకుంటుందని సర్వే చెబుతోంది.

పంజాబ్ అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 117. వీటిలో 94 సీట్ల నుంచి 100 సీట్లలో ఆప్ జెండా ఎగరనుందట. ఇదే నిజమైతే, ఇక పంజాబ్ లోనూ కాంగ్రెస్ - అకాలీదళ్ లకు నూకలు చెల్లినట్లే. ఇక సీఎంగా ఎవరైతే మంచిదని ప్రశ్నించిన ఆ సర్వే సంస్థ ప్రతినిధుల చెవుల్లో అరవింద్ కేజ్రీవాల్ పేరు మారుమోగిపోయిందట. పంజాబ్ ఓటర్లలో ఏకంగా 59 శాతం మంది కేజ్రీ పాలనకే మొగ్గుచూపారు. ఈ సర్వే అంచనాలే నిజమైతే... ఆప్ చేతికి మరో రాష్ట్రం చిక్కినట్లే. రెండు రాష్ట్రాలు కనుక కేజ్రీవాల్ చేతిలో ఉంటే బీజేపీ, కాంగ్రెస్ తరువాత ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీగా ఆప్ గుర్తింపు పొందుతుంది. అంతేకాదు.... దేశవ్యాప్తంగా విస్తరించడానికి ఆప్ చేపట్టాలనుకుంటున్న జైత్రయాత్రకు నాంది పడినట్లే.