Begin typing your search above and press return to search.

కేజ్రివాల్ ఊహించ‌ని షాక్ త‌గిలింది

By:  Tupaki Desk   |   29 July 2016 9:51 AM GMT
కేజ్రివాల్ ఊహించ‌ని షాక్ త‌గిలింది
X
త‌న‌ను చంపించేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సిద్ధ‌మ‌వుతున్నార‌ని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌ - ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోప‌ణ సేమ్ టు సేమ్ ఇపుడు ఆయ‌న‌కే ఎదురైంది. ఆ పార్టీకే చెందిన మాజీ మంత్రి ఆసిమ్ అహ్మ‌ద్ ఖాన్ అదే త‌ర‌హాలో కేజ్రివాల్‌ పై ఆరోప‌ణ‌లు చేశారు. త‌నొక్క‌డినే కాదు త‌న కుటుంబాన్ని చంప‌డానికి కేజ్రివాల్‌ కుట్ర ప‌న్నార‌ని ఆసిమ్ ఆరోపించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

అవినీతికి పాల్ప‌డుతున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌తో గ‌తేడాది అహ్మ‌ద్‌ ఖాన్‌ ను కేబినెట్ నుంచి తొల‌గించారు. అయితే తాజాగా మీడియా ముందుకు వ‌చ్చిన ఖాన్...గ‌త ప‌ది నెల‌లుగా కేజ్రీవాల్‌ - ఆయ‌న పార్టీ స‌భ్యులు చంపుతామంటూ బెదిరిస్తున్నార‌ని - త‌న కుటుంబం ప్ర‌మాదంలో ఉంద‌ని వాపోయారు. త‌న‌ను చంపుతామంటూ ఫోన్లలో బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. అంతేకాకుండా ప్ర‌త్య‌క్షంగానూ ప‌లువురు హెచ్చ‌రించార‌ని తెలిపారు. త‌న‌కున్న ప్రాణాపాయం గురించి ఇప్ప‌టికే పోలీసుల‌కు ఫిర్యాదుచేశాన‌ని, మే 2న కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ - లెఫ్ట్‌ నెంట్ గ‌వ‌ర్న‌ర్‌ కు లేఖ‌లు కూడా రాసిన‌ట్లు ఖాన్‌ వివ‌రించారు. కేజ్రీవాల్ ప్ర‌భుత్వానికి సంబంధించిన కీల‌క‌మైన ఆడియో - వీడియో ఆధారాలు త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని, తొంద‌ర్లోనే వాటిని విడుద‌ల చేసి కేజ్రీవాల్ నిజ‌స్వ‌రూప‌మేంటో బ‌య‌ట‌పెడ‌తాన‌ని అహ్మ‌ద్‌ ఖాన్ స్ప‌ష్టంచేశారు. త‌న కుటుంబానికి రక్ష‌ణ క‌ల్పించాల్సిందిగా కోరారు.

ఇదిలాఉండ‌గా ప్ర‌ధాని మోదీ త‌న‌ను చంపిస్తారేమోన‌ని కేజ్రీవాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మ‌రుస‌టి రోజే అహ్మ‌ద్‌ ఖాన్ కేజ్రీపై ఈ ఆరోప‌ణ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు ఆయ‌న ఆరోప‌ణ‌లను ఆమ్ ఆద్మీ పార్టీ తేలిగ్గా తీసుకుంది. అవినీతిలో కూరుకుపోయిన నాయ‌కుడికి ఇన్నాళ్లకు పార్టీ గుర్తుకువ‌చ్చింద‌ని వ్యాఖ్యానించింది.