Begin typing your search above and press return to search.

ఇంటి దగ్గర అపాయింట్ మెంట్ ఇస్తే కేసేనా?

By:  Tupaki Desk   |   9 July 2016 8:17 AM GMT
ఇంటి దగ్గర అపాయింట్ మెంట్ ఇస్తే కేసేనా?
X
ఢిల్లీ రాష్ట్ర అధికారపక్ష ఎమ్మెల్యేలు చిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎవరైనా మహిళలు తమ సమస్యలు చెప్పుకోవటానికి స్థానిక ఎమ్మెల్యే అపాయింట్ మెంట్ తీసుకొని.. ఆయన్ని ఇంట్లో కలిస్తే చాలు.. వారిపై లైంగిక వేధింపుల కేసు నమోదు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఏ ఒకళ్లో.. ఇద్దరో ఎమ్మెల్యేలకు పరిమితం కాకపోవటం గమనార్హం.

శుక్రవారం ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ పై ఒక మహిళ ఫిర్యాదు చేయటం.. తన పట్ల ఆప్ ఎమ్మెల్యే అసభ్యంగా ప్రవర్తించారని చెప్పటం.. ఆ వెంటనే పోలీసులు కేసు నమోదు చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా ఫిర్యాదు చేసిన మహిళ వివరాల్ని పోలీసులు వెల్లడించలేదు. అయితే.. తాజాగా ఈ ఉదంతానికి సంబంధించిన వివరాల్ని పోలీసులు వెల్లడించారు. సదరు మహిళది దక్షిణ ఢిల్లీలోని సంగం విహార్ ప్రాంతమని.. జూన్ 2న నీటిసమస్యను తీర్చాలంటూ ధర్నాలో పాల్గొన్నానని.. ఆ తర్వాత ఎమ్మెల్యేతో మాట్లాడటానికి అపాయింట్ మెంట్ తీసుకొని ఇంటికి వెళ్లినట్లుగా ఫిర్యాదు చేసిన మహిళ పేర్కొన్నారు.

ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన తర్వాత.. సదరు ఎమ్మెల్యే తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని.. తన ఛాతీ భాగాన్ని ఉద్దేశపూర్వకంగా తాకి భయపెట్టారని.. దీంతో భయపడి తాను బయటకు వచ్చేసినట్లు పేర్కొన్నారు. ఆసక్తికరమైన విషయంలో ఏమిటంటే.. ఇదే రీతిలో మరికొందరు ఆప్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు పోలీసులకు అందటం.. కేసులు నమోదు కావటం విశేషం. చూస్తుంటే.. ఏదైనా సమస్యల విషయంలో మాట్లాడేందుకు ఇంటి వద్దకు వస్తానని ఎవరైనా మహిళలు అపాయింట్ మెంట్ అడిగితే.. ఆప్ ఎమ్మెల్యేలు టైం ఇవ్వరేమో..?