Begin typing your search above and press return to search.

జైట్లీ రూ.57 కోట్లు తినేశారా..?

By:  Tupaki Desk   |   17 Dec 2015 12:33 PM GMT
జైట్లీ రూ.57 కోట్లు తినేశారా..?
X
ఢిల్లీ రాష్ట్ర స‌ర్కారుకు.. కేంద్రానికి మ‌ధ్య సాగుతున్న ఫైటింగ్ లో మ‌రో అంకం మొద‌లైంది. ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ముఖ్య‌కార్య‌ద‌ర్శి ఆపీసు మీదా.. ఇంటి మీదా సీబీఐ సోదాలు నిర్వ‌హించ‌టం.. కొన్ని ఫైళ్లు త‌మ‌తో తీసుకెళ్ల‌టం సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అలా సోదాలు నిర్వ‌హించిన దాని వెనుక అస‌లు కార‌ణం వేరే ఉందంటూ ఆమ్ ఆద్మీ నేత‌లు ఆరోపించ‌టం తెలిసిందే. ఇప్పుడు ఆరోప‌ణ‌ల స్థాయి నుంచి.. ఆర్థిక‌మంత్రి అరుణ్‌ జైట్లీ రూ.57కోట్లు తినేశారంటూ ఆమ్ ఆద్మీ దుయ్య‌బ‌డుతోంది.

జైట్లీ ఇరుక్కున్నారంటూ ఆఫ్ నేత‌లు చెబుతున్న కుంభ‌కోణం లెక్క‌ల్లోకి వెళితే.. ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షులుగా అరుణ్ జైట్లీ వ్య‌వ‌హ‌రించారు. ఈ స‌మ‌యంలో ఫిరోజ్ షా కోట్ల స్టేడియం పున‌ర్ నిర్మాణం జ‌రిగింది. ఇందుకోసం రూ.114కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు చూపించారు. కానీ.. అంత పెద్ద మొత్తం చూపించిన‌ప్ప‌టికీ.. వాస్త‌వానికి స్టేడియం నిర్మాణానికి అయిన ఖ‌ర్చు కేవ‌లం రూ.67కోట్లుగానే చెబుతున్నారు. స్టేడియం ప‌నులు చేసిన కాంట్రాక్ట‌ర్ కు రూ.67కోట్లు మాత్ర‌మే చెల్లించార‌ని.. మిగిలిన రూ.57 కోట్ల మాటేమిటంటూ ఆప్ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

ఢిల్లీ క్రికెట్ అసోసియేష‌న్ కుంభ‌కోణాన్ని ద‌ర్యాప్తు చేసే ప్ర‌య‌త్నంలో ఉన్న ప్ర‌తిసారీ ఏదో విధంగా కేంద్రం అడ్డుప‌డుతుంద‌ని చెబుతున్న ఆప్ నేత‌లు.. ఈ కుంభ‌కోణంలో జైట్లీ పాత్ర ఉంద‌ని స్ప‌ష్టంగా ఆరోపిస్తున్నారు.ఈ అంశంపై దర్యాప్తు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగాలంటే.. ముందు ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆరోప‌ణ‌ల్ని బీజేపీ నేత‌లు ఖండిస్తున్నారు. మొత్తంగా జైట్లీ మీద వ‌చ్చిన అవినీతి ఆరోప‌ణ‌ల‌తో వాతావ‌ర‌ణం ఇప్పుడు ఒక్క‌సారి వేడెక్కింది.