Begin typing your search above and press return to search.

కారును ఢీకొట్టేందుకు చీపురు సై

By:  Tupaki Desk   |   1 Oct 2018 10:19 AM GMT
కారును ఢీకొట్టేందుకు చీపురు సై
X
తెలంగాణ‌లో ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేందుకు దిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌) సిద్ధ‌మ‌వుతోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 119 స్థానాల్లోనూ టీఆర్ ఎస్‌ పై పోటీ చేయాల‌ని ఉవ్విళ్లూరుతోంది. ఆప్ సీనియ‌ర్ నేత‌ - దిల్లీ ఎమ్మెల్యే సోమ్‌ నాథ్ భార‌తి తాజాగా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు.

త‌ప్పుడు వాగ్దానాల‌తో తెలంగాణ ప్ర‌జ‌ల‌ను టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మోసం చేస్తున్నార‌ని సోమ్‌ నాథ్ భార‌తి విమ‌ర్శించారు. రాష్ట్రంలో పాల‌నాతీరును ఎండ‌గ‌ట్టారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అవినీతిలో కూరుకుపోయింద‌ని.. నిజాయ‌తీ క‌లిగిన ఆప్ వంటి పార్టీ కోస‌మే తెలంగాణ ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం ఎదురుచూస్తున్నార‌ని తెలిపారు. అవినీతిమ‌య కాంగ్రెస్‌ - టీఆర్ ఎస్‌ ల‌కు త‌మ పార్టీయే స‌రైన ప్ర‌త్యామ్నాయ‌మ‌ని సూచించారు.

తెలంగాణ‌లో త‌మ‌తో క‌లిసి పోటీ చేయాల్సిందిగా ఆఫ్‌ ను సీపీఎంతో కూడిన‌ బ‌హుజ‌న్ లెఫ్ట్ ఫ్రంట్ కోరింద‌ని సోమ్‌ నాథ్ వెల్ల‌డించారు. అయితే, వారి పిలుపును తాము తిర‌స్క‌రించామ‌న్నారు. ఒంట‌రిగానే బ‌రిలోకి దిగాల‌ను తాము నిర్ణ‌యించుకున్న‌ట్లు చెప్పారు.

విద్య‌ - ఆరోగ్యం - ప్ర‌జాసేవ రంగాల్లో దిల్లీలో ఆప్ ప్ర‌భుత్వం అద్భుత ఫ‌లితాలు రాబ‌ట్టింది. తెలంగాణ ప్ర‌జ‌ల‌కూ అలాంటి సేవ‌లే కావాలి. దిల్లీలో అనుస‌రించిన అభివృద్ధి వ్యూహాన్ని ఇక్క‌డ కూడా అమ‌లు చేసేందుకు మేం స‌మాయ‌త్త‌మ‌వుతున్నాం అని సోమ్‌ నాథ్ భార‌తి ఉద్ఘాటించారు. అవినీతి ర‌హిత స‌మాజ స్థాప‌న పిలుపుతో దిల్లీలో ప్ర‌కంప‌న‌లు సృష్టించి.. కాంగ్రెస్ - బీజేపీల‌ను మ‌ట్టిక‌రిపించిన ఆప్ తెలంగాణ‌లో ఏ మేర‌కు విజ‌య‌వంత‌మ‌వుతుందో తెలియాలంటే ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డే వ‌ర‌కు వేచి చూడాల్సిందేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.