Begin typing your search above and press return to search.

సిద్ధు విష‌యంలో ఆప్ నోబాల్ వేసిందా..?

By:  Tupaki Desk   |   22 July 2016 10:22 AM IST
సిద్ధు విష‌యంలో ఆప్ నోబాల్ వేసిందా..?
X
రాజ్య‌స‌భ‌కు సిద్ధూ రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో పంజాబీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మాజీ క్రికెట‌ర్ సిద్ధూ కీల‌కం కాబోతున్న‌ట్టు క‌థ‌నాలు వినిపించాయి. పంజాబ్ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ దూకుడును అడ్డుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ వేసిన ఎత్తుగ‌డ‌లో భాగంగానే సిద్ధు రాజీనామా చేశార‌ని చెప్పుకుంటున్నారు. ఆప్‌ లో సిద్ధూ చేరిక‌పై అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా సిద్ధూ చేయ‌లేదు. ప్ర‌స్తుతానికి మౌనంగానే ఉన్నారు. అయితే, సిద్ధూను ఆప్‌ లోకి ఆహ్వానించే అంశంపై ఆ పార్టీలో భిన్న‌గ‌ళాలు వినిపిస్తున్న‌ట్టు స‌మాచారం. ఆప్‌లోకి ఆయ‌న వ‌స్తే ఒప్ప‌కోమ‌ని కొంద‌రు - వ్య‌తిరేకంగా ప‌నిచేస్తామ‌ని మ‌రికొంద‌రు నాయ‌కులు పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్‌ కు సంకేతాలు ఇస్తున్నార‌ని తెలుస్తోంది. సిద్ధు విష‌యంలో వారు అలా అభిప్రాయ‌ప‌డ‌టానికి బ‌ల‌మైన కార‌ణం కూడా ఉంది.

ఆమ్ ఆద్మీ పార్టీలోకి సిద్ధూ వ‌చ్చి చేరితే ఏ విధంగా ఉంటుందీ అనే అంశంపై ఆప్ నాయ‌కులు ఓ స‌ర్వే నిర్వ‌హించారు. పంజాబ్‌ లోని రాష్ట్రవ్యాప్తంగా 26 చోట్ల సిద్ధూపై అభిప్రాయ సేక‌ర‌ణ చేసింది. ఆయ‌న రాక‌ప‌ట్ల ఆప్ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం కావ‌డం విశేషం. ఇక‌, మెజారిటీ అభిప్రాయం ఏంటంటే.. సిద్ధూ ఆప్‌ లోకి రావొద్దు అనే! ఆయ‌న్ని పార్టీలోకి తీసుకోవ‌డం వ‌ల్ల ఏమాత్రం ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని ఆప్ కార్య‌క‌ర్త‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. స్వ‌త‌హాగా సిద్ధూ మంచి వ‌క్త అయిన‌ప్ప‌టికీ కూడా పంజాబ్ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఆప్‌కి ఏమాత్రం ప్ల‌స్ కారు అని నిక్క‌చ్చీగా చెప్పేశార‌ట‌! కొంత‌మంది అయితే... ఆయ‌న్ని పార్టీలో తీసుకుంటే సొంత పార్టీకి వ్య‌తిరేకంగా ప‌నిచేయాల్సి వ‌స్తుంద‌ని కూడా హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం విశేషం.

సిద్ధూ చేరిక‌పై పంజాబ్ ఆప్ క‌న్వీన‌ర్ సంధూ స్పందించారు. ఆయ‌న చేరిక‌పై వ‌స్తున్న వార్తల్ని ఆయ‌న నిర్ద్వంద్వంగా కొట్టి పారేయ‌లేదుగానీ... ఆప్‌ లో ఆయ‌న ఇమ‌డ‌లేరు అని వ్యాఖ్యానించారు. ఒక‌వేళ ఆయ‌న పార్టీలో చేర‌డం ఖాయ‌మైతే పార్టీ సిద్ధాంతాల‌కు క‌ట్టుబ‌డి ఉంటాన‌ని మాట ఇవ్వాల్సి ఉంటుంద‌ని ష‌ర‌తు పెట్టారు. ఏదేమైనా, పంజాబ్‌ లో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా సిద్ధూని బ‌రిలోకి దింపాల‌ని ఆప్ భావించింది. సిద్ధూ సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తే భాజ‌పాని ఎదుర్కోవ‌డం సులువు అని కేజ్రీవాల్ అంచ‌నా వేశారు. అయితే, సొంత పార్టీలోనే ఆయ‌న చేరిక‌పై భిన్న‌స్వ‌రాలు వినిపిస్తున్నాయి. మ‌రి, కేజ్రీవాల్ ద‌గ్గ‌ర ప్లాన్ బి ఏదైనా ఉందా..? లేదా, పంజాబ్‌ లో అధికార సాధ‌నే ముఖ్య‌మని ఆప్ కార్య‌క‌ర్త‌ల‌కే న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం ఏదైనా చేస్తారా..?