Begin typing your search above and press return to search.

ఏపీలో నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ సేవ‌లు

By:  Tupaki Desk   |   2 Jan 2019 8:25 AM GMT
ఏపీలో నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ సేవ‌లు
X
నిరుపేద‌ల‌కు ఆరోగ్య ప్ర‌దాయినిగా పేరుగాంచిన ఆరోగ్య శ్రీ వైద్య సేవ‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నిలిచిపోయాయి. 6-7 నెల‌లుగా ప్ర‌భుత్వం త‌మ‌కు రూ.550 కోట్ల బ‌కాయిల‌ను చెల్లించ‌కపోవ‌డంతో మంగ‌ళ‌వారం నుంచి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు వైద్య సేవలను పూర్తిగా నిలిపి వేశాయి. ఆరోగ్య శ్రీ కార్డుతో ఆస్ప‌త్రికి వ‌చ్చిన రోగుల‌ను చికిత్స అందించ‌కుండానే వెన‌క్కి పంపుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఆరోగ్య శ్రీ నెట్ వ‌ర్క్ ప‌రిధిలో దాదాపు 450 ఆస్ప‌త్రులు ఉన్నాయి. వీటికి ప్ర‌భుత్వం దాదాపు 550 కోట్ల రూపాయ‌లు బ‌కాయి ప‌డింది. ఈ బ‌కాయిల‌పై మూడు నెల‌లుగా ప్ర‌భుత్వాన్ని ఆస్ప‌త్రులు సంప్ర‌దిస్తున్నాయి. త‌మ‌కు చాలా ఇబ్బంది అవుతోంద‌ని, వెంట‌నే డ‌బ్బు చెల్లించాల‌ని కోరుతున్నాయి. లేనిప‌క్షంలో ఆరోగ్య శ్రీ సేవ‌ల‌ను నిలిపివేస్తామ‌ని కూడా ఇటీవ‌ల హెచ్చ‌రించాయి.

బ‌కాయిల చెల్లింపుపై ఇదిగో అదిగా అంటూ ప్ర‌భుత్వం మీన‌మేషాలు లెక్కిస్తుండ‌టంతో ఆస్ప‌త్రులు తాజాగా తీవ్ర అసంతృప్తికి గుర‌య్యాయి. ఇంకా ఈ భారాన్ని తాము భ‌రించ‌బోమంటూ మంగ‌ళ‌వారం ఆరోగ్య శ్రీ సేవ‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. మొత్తం 80 వేల రోగులకు చెందిన ఆరోగ్య శ్రీ క్లెయిముల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వానికి చెందిన ఎన్టీఆర్ వైద్య ట్ర‌స్టు పెండింగ్ లో పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

తెల్ల రేష‌న్ కార్డుదారుల‌కు అందించే సేవ‌ల‌నే కాకుండా రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌ర్తించే ఎంప్లాయీస్ హెల్త్ స్కీం, జ‌ర్న‌లిస్టుల‌కు అందించే హెల్త్ స్కీం సేవ‌ల‌ను కూడా ఆస్ప‌త్రులు ప్ర‌స్తుతం నిలిపివేయ‌డం గ‌మ‌నార్హం. ఆరోగ్య శ్రీ సేవ‌లు నిలిచిపోవ‌డంతో ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. బకాయిల చెల్లింపులో ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.