Begin typing your search above and press return to search.

మ‌రోసారి ఏబీ న్యాయ‌పోరాటం.. కార‌ణ‌మిదే!

By:  Tupaki Desk   |   5 July 2022 6:42 AM GMT
మ‌రోసారి ఏబీ న్యాయ‌పోరాటం.. కార‌ణ‌మిదే!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును క‌ష్టాలు వీడ‌టం లేదు. వైఎస్ జ‌గ‌న్ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక దాదాపు రెండేళ్ల‌కుపైగా ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు స‌స్పెన్ష‌న్ కు గుర‌యిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు తీర్పు మేర‌కు ఇటీవ‌ల ప్రింటింగ్‌, స్టేషనరీ, స్టోర్స్‌ విభాగం కమిషనర్‌గా ఎట్ట‌కేల‌కు ఆయ‌న మ‌ళ్లీ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అయితే ఇంత‌లోనే ఆయనపై గతంలో క్రిమినల్‌ కేసు నమోదై ఉండటంతో అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ జూన్ 28న‌ ఉత్తర్వులు జారీచేసిన సంగ‌తి తెలిసిందే.

దీంతో ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు మ‌రోమారు న్యాయ‌పోరాటానికి దిగారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో ఏబీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న సమయంలో సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో అవినీతి జరిగిందని అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ) కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. దీన్ని కొట్టేయాల‌ని కోరుతూ ఏబీ తాజాగా హైకోర్టును ఆశ్ర‌యించారు.

పరికరాల కొనుగోలుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, ఎవరికీ ఒక్క పైసా కూడా చెల్లించలేదని వెంకటేశ్వర‌రావు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. విజిలెన్స్ కమీషన్ విచారణ లేకుండానే ఏసీబీ త‌న‌పై త‌ప్పుడు కేసులు పెట్టింద‌ని ఆరోపించారు.

తనపై అవినీతి నిరోధక శాఖ‌ పెట్టిన తప్పుడు కేసును ఎత్తివేయాలని కోరారు. ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా తీసుకునే అన్ని చర్యలను కోర్టులో తేలేవ‌ర‌కు స్టే ఇవ్వాల‌ని కోరారు. అంతేకాకుండా భద్రతా పరికరాల కొనుగోలులో ప్రభుత్వంలో తనకు ఎటువంటి పాత్ర లేదని, దాని కోసం ప్రత్యేక కమిటీ ఉందని వెంకటేశ్వర‌రావు త‌న పిటిష‌న్ లో పేర్కొన్నారు.

ఏడాదిన్నర క్రితమే కేసు నమోదైనప్పటికీ నేటికీ ఎలాంటి చార్జిషీట్ దాఖలు చేయలేద‌ని ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు త‌న పిటిష‌న్ లో పేర్కొన్నారు. ఛార్జిషీట్ దాఖలు చేయనప్పుడు, కోర్టులో విచారణ ప్రారంభం కానప్పుడు తాను సాక్షులను ఎలా ప్రభావితం చేయగలన‌ని లేదా బెదిరించగలన‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. హైకోర్టు కొట్టివేసిన సెక్షన్ల కింద ప్రభుత్వం తనను ఎలా సస్పెండ్ చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.