Begin typing your search above and press return to search.

అబ్బయ్య చౌదరి జాక్ పాట్ - ఐటీ మంత్రవుతారా?

By:  Tupaki Desk   |   28 May 2019 1:30 AM GMT
అబ్బయ్య చౌదరి జాక్ పాట్ - ఐటీ మంత్రవుతారా?
X
మంత్రివర్గం ఏర్పాటు విషయంలో మిస్టరీనే మిగిల్చారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ నెల 30న తను మాత్రమే ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. మంత్రి వర్గ ఏర్పాటు మాత్రం ఆ తర్వాత వారం నుంచి పది రోజుల వ్యవధిలో ఉంటుందనే మాట వినిపిస్తూ ఉంది. దీంతో మంత్రి పదవుల విషయంలో ఊహాగానాలు మరింతగా పెరిగిపోయాయిప్పుడు.

ఇలాంటి నేపథ్యంలో కొందరికి అనూహ్యంగా కూడా మంత్రి పదవులు లభించవచ్చు అనే ప్రచారం సాగుతోంది. కొందరు తొలి టర్మ్ ఎమ్మెల్యేలకు కూడా ఛాన్స్ దక్కుతుందనే ఊహాగానాలు చెలరేగుతూ ఉన్నాయి. అలా జాక్ పాట్ కొట్టబోయే వారిలో అబ్బయ్య చౌదరి కూడా ఒకరని అంటున్నారు పరిశీలకులు.

అబ్బయ్య చౌదరిని ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ ను ఓడించి ఎమ్మెల్యేగా నెగ్గారు చౌదరి. అది కూడా భారీ మెజారిటీతో. గత ఎన్నికల్లో చింతమనేని సాధించిన మెజారిటీ కన్నా ఇప్పుడు అబ్బయ్య చౌదరికి వచ్చిన మెజారిటీనే ఎక్కువ కావడం గమనార్హం.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా ఉన్నా చింతమనేని ప్రభాకర్ ఓడిపోరని, ఆయనను ఓడించాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదనే విశ్లేషణలు వినిపించాయి ఈ ఎన్నికల సమయంలో. అయితే అసాధ్యం అనుకున్న పని అబ్బయ్య చౌదరికి సుసాధ్యం అయ్యింది.

ఈయనకు కొంత రాజకీయ నేపథ్యం ఉంది. ఇక వ్యక్తిగతంగా ఈయనొక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. యూకేలో దాదాపు 17 సంవత్సరాల పాటు ఈయన సాఫ్ట్ వేర్ రంగంలో పని చేశారు. ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి దెందులూరు టికెట్ పొందారు. విజయకేతనం ఎగరేశారు.

చింతమనేని కి చెక్ చెప్పిన ఈయనకు మంత్రి పదవి దక్కుతుందనే మాట వినిపిస్తోందిప్పుడు. అది కూడా ఐటీ శాఖ మంత్రి పదవి అబ్బయ్య చౌదరికి దక్కవచ్చని - ఐటీ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి కావడంతో ఆయనకు ఆ ప్రాధాన్యత దక్కవచ్చని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.