Begin typing your search above and press return to search.

లండ‌న్ కుర్రాడు చిత్తుగా ఓడించాడు

By:  Tupaki Desk   |   23 May 2019 2:49 PM GMT
లండ‌న్ కుర్రాడు చిత్తుగా ఓడించాడు
X
అధికారం చేతిలో ఉంటే ఎవ‌రిని లెక్క చేయ‌కుండా చెల‌రేగిపోవ‌టం కొంత‌మంది నేత‌ల‌కు అల‌వాటు. ఏపీలో అలాంటి నేత‌ల జాబితాను త‌యారు చేస్తే.. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింత‌మనేని ప్ర‌భాక‌ర్ పేరు ముందువ‌రుస‌లో ఉంటుంది. ఇసుక అక్ర‌మాల్ని ప్ర‌శ్నించిన మ‌హిళా రెవెన్యూ అధికారి వ‌న‌జాక్షిపై దాష్ఠీకం విష‌యంలో ఆయ‌న చాలా బ్యాడ్ అయ్యారు. ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌టంలో సందేహించిన చంద్ర‌బాబు సైతం రాజ‌కీయంగా న‌ష్ట‌పోయార‌ని చెప్పాలి.

చేతిలో ప‌వ‌ర్ ఉంది క‌దా అని ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించిన చింత‌మ‌నేని తాజాగా వెల్ల‌డైన ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిపోయిన వైనం ఆస‌క్తిక‌రంగా మారింది. దెందులూరులో ఎవ‌రు పోటీ చేసినా తానే భారీ మెజార్టీతో గెలుస్తానంటూ తొడ‌లు కొట్టిన అత‌గాడికి భారీ షాక్ త‌గిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి కొఠారు అబ్బ‌య్య చౌద‌రి సాధించిన విజ‌యం చింత‌మ‌నేని అహంకారానికి చెంప‌పెట్టుగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. లండ‌న్ కుర్రాడిగా పేరున్న అబ్బ‌య్య చింత‌మ‌నేనిని దాదాపు 17వేల ఓట్ల తేడాతో ఓడించారు.

నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌టం.. మ‌హిళ‌ల విష‌యంలో అమ‌ర్యాద‌గా వ్య‌వ‌హ‌రించ‌టం లాంటి చేష్ట‌ల‌తో త‌న‌కు తోచిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ఆయ‌న తీరు త‌ర‌చూ వివాదాస్ప‌దంగా మారి వార్త‌ల్లో నిలిచేవారు. 2009లో తొలిసారి దెందులూరు నుంచి పోటీ చేసిన ఆయ‌న 14235 ఓట్ల‌తో విజ‌యం సాధిస్తే.. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో 17746 ఓట్ల‌తో గెలుపొందారు. వ‌రుస‌గా రెండుసార్లు విజ‌యం సాధించిన త‌ర్వాత చింత‌మ‌నేని ఆరాచ‌కాల‌కు ప‌ట్ట‌ప‌గ్గాల్లేకుండా పోయాయ‌న్న విమ‌ర్శ ఉంది.

ఇసుక అక్ర‌మ ర‌వాణాలో చింత‌మ‌నేని పేరు పెద్ద ఎత్తున వినిపించింది. దాన్ని అడ్డుకున్న అధికారిపై చేయి చేసుకునేందుకు సైతం వెనుకాడ‌లేదు. ఈ వ్య‌వ‌హారం వివాదాస్ప‌దంగా మారగా.. చింత‌మ‌నేని పిలిచి తిట్టాల్సిన సీఎం.. అందుకు భిన్నంగా మ‌హిళా అధికారికి చివాట్లు పెట్ట‌టం అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. దెందులూరు ప‌రిధిలో ప‌లు అవినీతి అక్ర‌మాల‌లో చింత‌మ‌నేని పేరు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉండేది. మొత్తానికి తాజా ఓట‌మితో దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో చింత‌మ‌నేని ఆరాచ‌క‌ప‌ర్వానికి పుల్ స్టాప్ ప‌డిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.