Begin typing your search above and press return to search.

వర్ణ వివక్షకు మేమూ కూడా ఎదుర్కొన్నాం : ఇండియన్ క్రికెటర్స్ !

By:  Tupaki Desk   |   4 Jun 2020 7:10 AM GMT
వర్ణ వివక్షకు మేమూ కూడా ఎదుర్కొన్నాం : ఇండియన్ క్రికెటర్స్ !
X
అమెరికాలో ఓ శ్వేతజాతి పోలీస్‌ అధికారి గతవారం కర్కశంగా ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఊపిరి తీయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అనేక మంది అనేక రకాలుగా స్పందిస్తున్నారు. అన్ని క్రీడల్లాగే క్రికెట్‌లోనూ జాతి వివక్ష ఉందని వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా తాము కూడా వర్ణ వివక్ష ఎదుర్కొన్నామని భారత బ్యాట్స్‌ మన్‌ అభినవ్‌ ముకుంద్‌, మాజీ పేసర్‌ దొడ్డ గణేష్‌ వెల్లడించారు.

వివక్షపై తమకెదు రైన అనుభవాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ‘ఆటలో భాగంగా 15 ఏళ్ల వయసు నుంచే మన దేశంతోపాటు ప్రపంచమంతా తిరుగుతూనే ఉన్నా. ఎండలో ఆడడం వల్ల మరింత నల్లగా కనిపించే వాడిని. అయితే, నా శరీర వర్ణం గురించి అందరూ ప్రత్యేకంగా చర్చించుకునేవారు. ఎంతో మంది నన్ను అనేక విధాలుగా పిలిచేవారు. వాటిని పట్టించుకోకుండా నా లక్ష్యం దిశగా సాగిపోయా. సోషల్‌ మీడియాలో కూడా ఎన్నో అవమానకర సందేశాలు వచ్చినా.. స్పందించడం మానేశా’ అని మూడేళ్ల క్రితం తాను పెట్టిన ట్వీట్‌ ను అభినవ్‌ తాజాగా రీట్వీట్‌ చేశాడు.తమిళనాడు కు చెందిన 30 ఏళ్ల ముకుంద్‌ జాతీయ జట్టు తరఫున 7 టెస్టులు ఆడాడు. తానాడే రోజుల్లో తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైందంటూ కర్ణాటకకు చెందిన 46 ఏళ్ల గణేష్‌ చెప్పాడు. కానీ, వాటి నుంచి తాను మరింత బలంగా తయారయ్యానని ట్వీట్‌ చేశాడు.

అలాగే, అమెరికా పోలీసులతో కర్కశమైన అనుభవం తనకూ ఎదురైందని నల్లజాతి టెన్నిస్‌ ప్లేయర్‌ జేమ్స్‌ బ్లేక్‌ వివరించాడు. ఐదేళ్ల క్రితం యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ సమయంలో ఈ ఘటన జరిగిందని, అది తలచుకుంటే పోలీసుల తీరుపై ఇప్పటికీ వణుకు పుడుతుందని 40 ఏళ్ల బ్లేక్‌ చెప్పాడు.‘2015లో యూఎస్‌ ఓపెన్‌ జరుగుతుండగా నేను మన్‌హటన్‌ హోటల్‌ బయట నిల్చున్నాను. ఒక అభిమాని నాకు సమీపంగా వచ్చి నా మ్యాచ్‌ల్ని ఆసక్తిగా చూసేవాడినని చెప్పాడు. తన కూతురు టెన్నిస్‌ ఆడుతుందన్నాడు. తర్వాత కాసేపటికే న్యూయార్క్‌ పోలీసులు నన్ను కర్కశంగా అదుపులోకి తీసుకున్నారు. క్రెడిట్‌ కార్డు మోసానికి పాల్పడిన వ్యక్తి నాలాగే ఉండటంతో నేనే మోసగాడినని నిశ్చయించుకున్న పోలీసులు నా పెడరెక్కలు విరిచేసి తొక్కిపెట్టేశారు. కనీస నిర్ధారణ అంటూ చేసుకోకుండానే నల్ల జాతీయులపై ఈ స్థాయిలో అణచివేత ఉంటుంది' అని ప్రపంచ మాజీ నాలుగో ర్యాంకర్‌ బ్లేక్‌ నాటి భయంకర అనుభవాన్ని వివరించాడు.