Begin typing your search above and press return to search.

అభినవ కుంతీపుత్రుడు.. 27 ఏళ్లకు తల్లి వద్దకు వెళ్లి న్యాయం చేశాడు

By:  Tupaki Desk   |   5 Aug 2022 4:22 AM GMT
అభినవ కుంతీపుత్రుడు.. 27 ఏళ్లకు తల్లి వద్దకు వెళ్లి న్యాయం చేశాడు
X
ఇది రీల్ కథ కాదు రియల్ కథ. రీల్ కు సరిపడేంత డ్రామా ఈ వాస్తవ ఉదంతం సొంతం. అనూహ్యంగా తల్లిగా మారి.. ఆ భారాన్ని వదిలించుకున్న పురాణ కాలం నాటి కుంతి కథ కాదు. ఎన్నో బాధలు.. మరెన్నో వేదనల నడుమ వదిలించుకోవాల్సి వచ్చింది. అయితే.. పురాణ కుంతీపుత్రుడు ఏం చేశాడన్నది తెలిసిందే. నేటి తరం కుంతీపుత్రుడు మాత్రం తల్లికి అండగా నిలవటమే కాదు.. 27 ఏళ్ల తర్వాత ఆమె తరఫున పోరాడి.. ఆమెకు జరిగిన అన్యాయానికి న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. సంచలనంగా మారిన ఈ ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలిసిన వారితో తప్పనిసరిగా పంచుకోవాల్సిన ఉదంతంగా దీన్ని చెప్పాలి. అసలేం జరిగిందంటే.

దాదాపు 27 ఏళ్ల క్రితం. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఘోరం జరిగింది. దగ్గర దగ్గర పదకొండేళ్ల వయసున్న బాలిక తన సోదరి ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని వేళ.. దగ్గర్లోని అన్నదమ్ములు ఆమెను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. తనకు జరిగిందేమిటో అర్థం కాక ఏడుస్తున్నా.. ఆ రాక్షసులు వదల్లేదు. అలా ఒకసారి రెండుసార్లు కాదు.. పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. చివరకు ఆ మైనర్ గర్భం దాల్చింది. ప్రాణం మీదకు రావటంతో ఆమె బిడ్డను కనాల్సి వచ్చింది. దత్తత మీద ఆమె కుటుంబం బిడ్డను వదిలించుకొని ఆ ఊరును విడిచి పెట్టి.. రాంపూర్ కు వలస వెళ్లిపోయింది.

ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమెకు పెళ్లి జరగటం.. ఆమె అత్యాచారానికి గురైందన్న విషయం తెలుసుకున్న భర్త.. పదేళ్ల కాపురాన్ని పక్కన పెట్టి.. ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. దీంతో.. ఆమె ఒంటరిగా నిలిచింది. కాలం కరిగింది. కుంతీ పుత్రుడు పెరిగి పెద్దవాడు అయ్యాడు. తాను పెరిగింది దత్తత తల్లిదండ్రుల వద్ద అన్న విషయాన్ని గుర్తించాడు. అసలు తల్లి కోసం వెతుకులాట మొదలు పెట్టాడు.

అతి కష్టమ్మీద ఆమెను కలిశాడు. తనకు జరిగిన అన్యాయం మీద ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తెలిసి తెలియని వయసులో ఆమెకు జరిగిన అన్యాయానికి రగిలిపోయాడు. పోరాటానికి సిద్ధమయ్యాడు. తన తల్లికి 1994లో జరిగిన అఘాయిత్యం గురించి చెప్పి.. కంప్లైంట్ ఇచ్చాడు.కానీ.. మూడు దశాబ్దాల క్రితం కేసు కావటంతో ఫిర్యాదు తీసుకోవటానికి ఇష్టపడలేదు. కానీ.. కోర్టు జోక్యం చేసుకోవటంతో విచారణ షురూ చేయక తప్పలేదు. మొత్తానికి 2021 మార్చి నాలుగున సాహ్ జహాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది.

బాధితురాలి గురించి తెలిసి.. ఆమె కోసం చేస్తున్న న్యాయపోరాటానికి స్పందించిన పోలీసులు ప్రత్యేక టీంను సిద్ధం చేసి.. విచారణను చేపట్టింది. దశాబ్డాల క్రితం నాటి కేసు కావటం.. నిందితుల పేర్లు పూర్తిగా తెలీకపోవటంతో విచారణకు సవాలుగా మారింది. అయినప్పటికీ.. చిన్నవయసులో ఆమె పడిన క్షోభను సీరియస్ గా తీసుకున్న అధికారులు మరింత పట్టుదలతో విచారణ చేపట్టారు. ఈ విషయంలో ఎస్ ఐ ధర్మేంద్ర కుమార్ గుప్తా దగ్గరుండి విచారణ చేయటంతో.. నిందితులు తమ స్టేషన్ పరిధిలోని హద్దాఫ్ ప్రాంతంలో ఉంటారన్న విషయాన్ని గుర్తించారు.

నిందితులుగా అనుమానిస్తున్న సోదరుల్ని గుర్తించిన పోలీసులు.. వారిని విచారించినప్పుడు బాధితురాలు ఎవరో తమకు తెలీదని గట్టిగా వాదించారు. అయితే.. కోర్టు ఆదేశాలతో వారికి డీఎన్ ఏ పరీక్ష నిర్వహించారు. 2021 జులైలో శాంపిల్స్ ల్యాబ్ కు పంపితే.. ఫలితం రావటానికి తొమ్మిది నెలలు పట్టింది. ఫలితంలో మొహమ్మద్ రాజీ ఆ బిడ్డకు తండ్రిగా తేలాడు. పోలీసులు వారెంట్ తీసుకొని నిందితుల ఇళ్లకు వెళ్లటం.. వారు అప్పటికే పరారయ్యారు.

దీంతో పోలీసులు మరింత పట్టుదలతో వారి గురించి గాలింపు మొదలు పెట్టారు. పెద్ద ఎత్తున ప్రయత్నాలతో పాటు సాంకేతికత సాయంతో వారిని గుర్తించే ప్రయత్నం చేశారు. చివరకు నిందితుల్లో రాజీని హైదరాబాద్ లో గుర్తించారు. యూపీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. గతంలో తాము చేసిన పనికి తాము దొరుకుతామని అనుకోలేదని నిందితుడు చెప్పుకొచ్చాడు. మరో నిందితుడు ఒడిశాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి.. అతన్ని అదుపులోకి తీసుకునేందుకు అక్కడకు వెళ్లారు. తన తల్లిని వెతుక్కుంటూ వెళ్లటమే కాదు.. ఆమెకు జరిగిన అన్యాయానికి తల్లడిల్లి ఆమెకు న్యాయం చేసేందుకు తపించిన ఈ కుంతీ పుత్రుడి ఉదంతం ఇప్పుడు వార్తగా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల కమిట్ మెంట్ ను.. వారి శ్రమను అభినందించాల్సిందే.