Begin typing your search above and press return to search.

అభిషేక్ అరెస్టు.. ఆగంమాగం కానున్న కేసీఆర్ ఫ్యామిలీ?

By:  Tupaki Desk   |   11 Oct 2022 4:26 AM GMT
అభిషేక్ అరెస్టు.. ఆగంమాగం కానున్న కేసీఆర్ ఫ్యామిలీ?
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంకు తెలంగాణ రాష్ట్ర అధికారపక్షానికి చెందిన కుటుంబ సభ్యులకు లింకులు ఉన్నాయన్న ప్రచారం అంతకంతకూ జోరందుకుంటోంది. సీఎం కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న కవిత వద్ద ఒకప్పుడు సహాయకుడిగా వ్యవహరించిన అభిషేక్ రావును తాజాగా పోలీసులు అరెస్టు చేయటం తెలిసిందే. ఈ అరెస్టుకు ముందు సీబీఐ.. ఈడీలు భారీగా తవ్వుడు తవ్వారని.. వారు వెలికి తీసిన వివరాలు ఇప్పుడు మరికొందరికి తలనొప్పిగా మారినట్లుగా తెలుస్తోంది.

అభిషేక్ రావుకు తెలంగాణ రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. అతగాడి వ్యాపార చైన్ మామూలుగా లేదన్న మాట వినిపిస్తోంది. రియల్ ఎస్టేట్.. మైనింగ్.. కెమికల్స్ ఇలా పలు రకాల వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు.

అంతేకాదు.. అతగాడి వ్యాపార సంస్థలు ఏవి? ఎందులో అతడు పెట్టుబడులు పెట్టాడు? అన్న దానిపై భారీగా తవ్వినట్లుగా తెలుస్తోంది. అభిషేక్ రావుతో వ్యాపార సంబంధాలు.. భారీఎత్తున నగదు చేతులు మారిన వైనానికి సంబంధించిన ఆధారాల్ని దర్యాప్తు సంస్థలు సేకరించినట్లు తెలుస్తోంది.

ఈ స్కాంలో మొదట్నించి వినిపిస్తున్న మరో ప్రముఖుడు అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిసి అభిషేక్ రావు వ్యాపారం చేసినట్లు చెబుతున్నారు. పిళ్లైతో కలిసి నిర్వహిస్తోన్న రాబిన్ డిస్టలరీస్.. రికార్డుల్లో ఉన్న అడ్రస్ లో లేదన్న విషయాన్ని గుర్తించారు. అంతేకాదు మాదాపూర్ అనూస్ బ్యూటీపార్లర్ అడ్రస్ లో అభిషేక్ కు సంబంధించిన కంపెనీ ఒకటి నిర్వహిస్తున్నట్లుగా అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు.

ఏది ఏమైనా.. అభిషేక్ అరెస్టుతో విషయం ఆగదని.. మరిన్ని అరెస్టులు రాబోయే రోజుల్లో తప్పదంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ కేసీఆర్ కుటుంబాన్ని ఆగమాగం చేసే అవకాశం ఉందన్న మాట రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి లెక్క తేల్చేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు హైదరాబాద్ లో తిష్ట వేసుకొని కూర్చోవటంతో పాటు..

మరిన్ని అరెస్టుల దిశగా అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. అభిషేక్ అరెస్టు కావటం.. సీబీఐ కస్టడీలో ఉన్న అతగాడు విచారణలో నోరు విప్పితే మాత్రం మరింత మంది ప్రముఖులకు తిప్పలు తప్పవన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.