Begin typing your search above and press return to search.

సుప్రీంపై రాష్ట్ర‌ప‌తికి కంప్లైంట్ చేసిన ఏబీకే

By:  Tupaki Desk   |   18 Sep 2016 9:02 AM GMT
సుప్రీంపై రాష్ట్ర‌ప‌తికి కంప్లైంట్ చేసిన ఏబీకే
X
అమ‌రావ‌తిలో రాజ‌ధాని నిర్మాణం - భూములు పోగొట్టుకున్న రైతుల ప‌క్షాన పోరాడుతున్న ప్రముఖ జ‌ర్నలిస్టు.. ఏబీకే ప్ర‌సాద్‌.. త‌న‌కు సుప్రీం కోర్టులో పెద్ద ఎదురు దెబ్బ త‌గిలినా.. పోరు మాత్రం ఆపే ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు. రాజ‌ధాని నిర్మాణాన్ని ప్ర‌శ్నిస్తూనే.. రైతుల నుంచి పెద్ద ఎత్తున బెదిరించి ప్ర‌భుత్వం భూములు స్వాధీనం చేసుకుంద‌ని ఈ విష‌యంలో త‌గిన న్యాయం చేయాల‌ని ఆయ‌న ఇటీవ‌ల సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై సుప్రీం స్పందిస్తూ.. మీరేమ‌న్నా బాధితులా? అని ప్ర‌శ్నించింది. కాద‌ని చెప్ప‌డంతో కేసును మూసేసింది. దీనిపై అప్ప‌ట్లో అధికార ప‌క్షం నుంచి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న ఏబీకే.. తాజాగా మ‌రోసారి త‌న పోరును ఉధృతం చేశారు.

రైతుల ప్రయోజనాలు - జాతీయ వనరుల పరిరక్షణ విషయంలో గతంలో మాదిరిగా సామాజిక బాధ్యతగల వ్యక్తులెవరైనా సుప్రీకోర్టును ఆశ్రయించవచ్చా? లేక బాధితులు మాత్రమే కోర్టు తలుపులు తట్టాలా? అనే విషయాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్‌–143(1) కింద సుప్రీంకోర్టుకు ప్రస్తావించాలని కోరుతూ.. రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి లేఖ రాశారు. మేరకు శుక్రవారం లేఖ రాస్తూ... ప్రజాప్రయోజనాలకు సంబంధించి న్యాయవ్యవస్థ - సుప్రింకోర్టు చిట్టచివరి ఆశ అని - గతంలో పోస్టు కార్డుకు కూడా న్యాయస్థానాలు స్పందించాయని ప్రసాద్ గుర్తు చేశారు. వ్యక్తులుగా సామాజిక స్పృహ ఉన్నవారు ఎవరైనా సామాన్యుల కోసం కోర్టుకు వెళితే ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు.

ఏపీలో రైతులు - జాతీయ వనరుల పరిరక్షణలో - వనరులు - కాంట్రాక్ట్‌ ల కేటాయింపుల్లో పారదర్శకత తీసుకురావడంలో సుప్రీంకోర్టు తమ విధులను నిర్వర్తించడంలో విఫలమైందని ప్రసాద్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ప్రజల సంక్షేమం కోసం తగు విధంగా విధి నిర్వహణ చేయాల్సిన ప్రధాన న్యాయమూర్తి... తాను రామరాజ్యాన్ని తేలేనని వ్యాఖ్యానించినట్లు పత్రికల్లో వచ్చిందన్నారు. తన వ్యాఖ్యల ద్వారా తోటి న్యాయమూర్తుల్లో విశ్వాసాన్ని కలిగించలేకపోతున్నారని చెప్పారు.

ఈ విష‌యంలో క‌లుగ‌జేసుకుని.. ప్ర‌జాప్ర‌యోజ‌నం కోసం తాను దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను తిరిగి విచార‌ణ‌కు స్వీక‌రించేలా, విచార‌ణ జ‌రిపేలా సుప్రీం కోర్టును మార్గ‌ద‌ర్శ‌నం చేయాల‌ని ఏబీకే విజ్ఞప్తి చేశారు. మ‌రి ఈ పిటిష‌న్‌ పై రాష్ట్ర‌ప‌తి ఎలా స్పందిస్తారో చూడాలి. ఏదేమైనా చంద్ర‌బాబు ను ఏబీకే ఇప్ప‌ట్లో వ‌దిలిపెట్టేలాలేర‌నేది స్ప‌ష్ట‌మైంది.