Begin typing your search above and press return to search.

ఆర్కే వ‌ర్సెస్ ఆర్కేః సిస‌లైన స‌మ‌రం షురూ!

By:  Tupaki Desk   |   1 Aug 2017 10:12 AM GMT
ఆర్కే వ‌ర్సెస్ ఆర్కేః సిస‌లైన స‌మ‌రం షురూ!
X
నిజ‌మే... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లోనే కాకుండా ప‌త్ర‌కా రంగంలో సిస‌లైన పోరు మొద‌లైందనే చెప్పాలి. వేమూరి రాధాకృష్ణ ఆధ్వ‌ర్యంలోని ఆంధ్రజ్యోతి ప‌త్రిక‌పై వైసీపీ కీల‌క నేత‌ - గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి కోర్టులో వేసిన ప‌రువు న‌ష్టం దావా కేసు విచార‌ణ కాసేప‌టి క్రితం ప‌ట్టాలెక్కేసింది. హైద‌రాబాదులోని నాంప‌ల్లి కేంద్రంగా ప‌నిచేస్తున్న 17వ అద‌న‌పు చీఫ్‌ మెట్రోపాలిట‌న్ మేజిస్ట్రేల్ కోర్టు ఇందుకు వేదిక‌గా నిలిచింద‌ని చెప్పాలి. మ‌రి ఈ కేసులో ఎవ‌రిది పై చేయిగా నిలుస్తుంద‌న్న విష‌యంపై ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది. ఈ కేసుపై అటు ఏపీలోనే కాకుండా ఇటు తెలంగాణ‌లోనూ ఆస‌క్తిక‌ర ర‌చ్చ సాగుతోంది.

దీనికి సంబంధించిన వివ‌రాల్లోకెళితే... ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై టీడీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించే రాధాకృష్ణ ఆధ్వ‌ర్యంలోనే ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చురిస్తోంద‌ని ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఆ ప‌త్రిక‌లో వైఎస్ జ‌గ‌న్ పై వ‌చ్చిన ఓ క‌థ‌నాన్ని ఆధారం చేసుకుని ఆళ్ల‌... దానిపై ఏకంగా కేసు న‌మోదు చేయాలంటూ కోర్టును ఆశ్ర‌యించారు. కోర్టుకు సంబంధించిన వ్య‌వ‌హారాల్లో ప‌క్కాగా వ్య‌వ‌హ‌రించే నైజ‌మున్న ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి... త‌న పిటిష‌న్‌ కు ఆధారాల‌ను కూడా జ‌త చేశార‌ట‌. త‌న పిటిష‌న్‌ లో ఆయ‌న స‌ద‌రు ప‌త్రిక ఎండీ హోదాలో వేమూరి రాధాకృష్ణ‌తో పాటు ఆ ప‌త్రిక ప‌బ్లిష‌ర్‌ గా ఉన్న వెంక‌ట శేష‌గిరిరావు - ఎడిట‌ర్ శ్రీనివాస్‌ తో పాటు ప‌లువురు ప‌త్రికా సిబ్బందిని కూడా ప్ర‌తివాదులుగా చేర్చారు.

ఈ ఆధారాల‌ను ప‌రిశీలించిన కోర్టు... పిటిష‌న్‌ ను విచార‌ణ‌కు స్వీక‌రిస్తున్న‌ట్లుగా పేర్కొన‌డ‌మే కాకుండా... ఈ కేసులో తొలుత మీ వాంగ్మూల‌మే కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందుకు ఏమాత్రం బెద‌ర‌ని ఆళ్ల‌... నేటి ఉద‌యం కోర్టు నిర్దేశించిన స‌మ‌యానికే కోర్టు హాలుకు చేరుకుని త‌న వాంగ్మూలాన్ని ఇచ్చారు. కోర్టు కూడా ఆయ‌న వాంగ్మూలాన్ని రికార్డు చేసుకుని త‌దుప‌రి విచార‌ణ‌ను వాయిదా వేసిన‌ట్లుగా పేర్కొంది. అయితే ఈ కేసు ఇక్క‌డితో ముగిసిపోద‌ని, ఆర్కేగా జ‌నం పిలుచుకునే ఆళ్ల వాంగ్మూలంతో మొద‌లైన ఈ కేసు విచార‌ణ రానున్న రోజుల్లో పెను సంచ‌ల‌నాల‌కు కార‌ణమ‌వుతుంద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.

వేమూరి రాధాకృష్ణ త‌న టీవీ ఛానెల్ ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతిలో *ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే* పేరిట ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. అంటే జ‌నంలో ఆర్కేగా ముద్ర‌ప‌డ్డ ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, మీడియాలో ఆర్కేగా పేరు ప‌డ్డ వేమూరి రాధాకృష్ణ‌తో ప్ర‌త్య‌క్ష యుద్ధానికి దిగిపోయార‌న్న మాట‌. మ‌రి ఈ యుద్ధంలో గెలుపు ఎవ‌రిద‌న్న విష‌యం అత్యంత ఆస‌క్తికరంగా మారిపోయింది. ఇప్ప‌టికే స‌దావ‌ర్తి భూముల విష‌యంలో కోర్టు సాక్షిగానే అధికార టీడీపీపై దాదాపుగా విజ‌యం సాధించిన ఆళ్ల‌ను ఓడించ‌డం రాధాకృష్ణ బృందానికి అంత ఈజీ ఏమీ కాద‌న్న వాద‌న వినిపిస్తోంది.