Begin typing your search above and press return to search.

గమనించారా?; పవన్ కు ఆర్కే ఇచ్చిన సలహా

By:  Tupaki Desk   |   18 April 2016 5:16 PM GMT
గమనించారా?; పవన్ కు ఆర్కే ఇచ్చిన సలహా
X
తెలుగు మీడియాలో పేరు ప్రఖ్యాతులున్న సంస్థల్లో ఒకటి ఆంధ్రజ్యోతి. దాని యజమాని ఆర్కే ప్రతి వారాంతంలో ఒక కాలమ్ రాస్తుంటారు. ఆయన ఆ కాలమ్ లో కాస్త స్వేచ్ఛగా తన రాజకీయ అభిప్రాయాల్ని చెప్పేస్తుంటారు. కొన్ని పరిస్థితుల్ని విశ్లేషిస్తుంటారు. సందర్భానుసారంగా గతంలో జరిగిన కొన్ని విషయాల్ని బయట ప్రపంచం ముందు బయటపెడతారు. మీడియా సంస్థ అధిపతిగా తనకుండే సౌలభ్యాలు ఆయన అక్షరాల్లో అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ముఖాముఖి యుద్ధం సాగుతున్న వేళ.. తెలంగాణ ఉద్యమంలో తానెంత సాయం చేసిన విషయాన్ని ప్రస్తావించటమే కాదు.. తెలంగాణ ఉద్యమాన్ని మరో మలుపు తిప్పిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష.. నిమ్స్ ఎపిసోడ్ ను తాను ఎలా నడిపించిన విషయాన్ని చెప్పుకొచ్చారు. తన అక్షరాలతో తెలుగు రాజకీయాల్ని తానెంత ప్రభావితం చేసిన విషయాన్ని చెప్పుకునేందుకు ఆయన అంత మొహమాట పడలేదు. పడరు కూడా.

జర్నలిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. మీడియా సంస్థ అధినేతగా మారిన ఆర్కేకు.. రిపోర్టర్ కు ఉండే సహజ లక్షణాల పోలేదని చెప్పాలి. వందలాది జర్నలిస్టులు ఉన్నప్పటికీ.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని అవసరానికి అనుగుణంగా చెప్పేయటంలో ఆయన నేర్పరనే చెప్పాలి. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరీర్.. ఏపీ రాజకీయాల్లోకి పవన్ అవసరం ఎంత? ఒకవేళ ఆయన కానీ పాలిటిక్స్ లో యాక్టివ్ అయితే ఏం జరిగే అవకాశం ఉంది? ఎలాంటి పరిస్థితులు.. పరిణామాలు చోటు చేసుకునే వీలుందో వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు.

మరి.. ఆర్కే చెప్పిన మాటల్ని మూడు ముక్కల్లో తేల్చేసి చెప్పాల్సి వస్తే.. ఆయన ఒక విషయాన్ని చాలా సూటిగా చెప్పేస్తూ. పవన్ లాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి పాలిటిక్స్ కు సరిపోడని.. అందులోకి మురికి కూపం లాంటి రాజకీయాల్లోకి రావటం కంటే కూడా.. విజిల్ బ్లోయిర్ గా ఉంటే మంచిదన్న సూచనను చేశారు. అంతేనా.. తన రాజకీయ పరిణితిని చాటి చెప్పుకునేందుకు వీలుగా ఒక ఉదాహరణను ప్రస్తావించారు.

లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ లాంటి మేధావికి తాను గతంలో సలహా ఇవ్వటమే కాదు.. రాజకీయాల్లోకి రావొద్దని సూచించానని.. కానీ ఆయన వినకుండా వచ్చి.. ఇప్పుడేం చేస్తున్నారో చూశారా? అంటూ కాసింత తెలివిగా చెప్పారు. ఏపీలోని ధనం.. కులంతో కూడిన రాజకీయాల నేపథ్యంలో పవన్ ఎంట్రీ రాంగ్ ఛాయిస్ గా అభిప్రాయపడిన ఆయన.. గెలుపోటములకు సంబంధం లేని రాజకీయాల్లోకి అడుగు పెట్టే కన్నా.. విజిల్ బ్లోయిర్ గా ఉంటూ ప్రభుత్వాల్ని తట్టి లేపటం.. వారిపై ఒత్తిడి తెచ్చి పనులు అయ్యేలా చూడాలని చెప్పటం చూసినప్పుడు పవర్ రాజకీయాల్లోకి యాక్టివ్ గా రావాలన్న ఆలోచనకు తన స్పందనను అడగకుండానే చెప్పేశారని చెప్పాలి.