Begin typing your search above and press return to search.

నోట్ల రద్దుతో కేసీఆర్ కలవరాన్ని చెప్పిన ఆర్కే

By:  Tupaki Desk   |   14 Nov 2016 5:30 PM GMT
నోట్ల రద్దుతో కేసీఆర్ కలవరాన్ని చెప్పిన ఆర్కే
X
ప్రముఖ మీడియా సంస్థకు చెందిన వ్యక్తి.. వ్యాపార అంశాల్ని చూసుకుంటూనూ ప్రతి వారాంతంలో తన అభిప్రాయాల్ని ‘కొత్త పలుకు’ పేరిట తన దినపత్రికలో అచ్చేసుకోవటం గమనార్హం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా సంస్థల్ని నిర్వర్తిస్తున్న వారు సొంతంగా నాలుగు ముక్కులు రాసే పరిస్థితే లేదని చెప్పాలి. అలా చూస్తే.. ఇంతకాలం తర్వాత కూడా ఆంధ్రజ్యోతి యజమాని ఆర్కే అలియాస్ రాధా కృష్ణమూర్తి వీలైనంత వరకూ వారాంతంలో తాజా రాజకీయ పరిణామాలపై రాస్తుంటారు. అయితే.. ఈ రాతలపై మిశ్రమ స్పందన లబిస్తోందన్న వాదన ఉంది.

ఆయన రాసే అంశాల్లో వీలైనంతవరకూ రాజకీయాంశాలే ఎక్కువ. బయటకు రాని.. మీడియాలో పెద్దగా ఫోకస్ చేయని అంశాల్ని రాసే ఆయన.. తన రాతలతో తన మైండ్ సెట్ ఏమిటనే విషయాన్ని చెప్పకనే ఆయన చెప్పేస్తుంటారు. తాజాగా ఆయన ప్రధాని మోడీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు ఉదంతం.. దాని కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న వెతలతో పాటు.. తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఆయన చేసిన విశ్లేషణ కాస్తంత ఆసక్తికరంగా ఉందనే చెప్పాలి.

మోడీ తీసుకున్న తాజా నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలవరాన్ని తన కాలమ్ తో చెప్పే ప్రయత్నం చేశారు. పెద్దనోట్ల రద్దుతో ప్రధాని మోడీ నిర్ణయంపై కేసీఆర్ ఏం అనుకుంటున్నారు? అందులో వాస్తవం పాళ్లు ఎంతన్న విషయాలపై ఆయన తన కాలమ్ లో వివరించే ప్రయత్నం  చేశారు. ఆర్కే వెలుబుచ్చిన అభిప్రాయాల్ని ఆయన మాటల్లోనే చూస్తే..

‘‘పెద్ద నోట్ల రద్దుతో ఎదురయ్యే నష్టాల్ని చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ వద్ద మొర పెట్టుకున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పడిపోతుంది. నల్లధనం పుణ్యమా అని వ్యాపారాలు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విలసిల్లుతున్నాయి. దేశంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వినిమయతత్వం విపరీతంగా పెరగటానికి ప్రధాన కారణం నల్లధనమే. పెద్దనోట్ల రద్దుతో గ్రామీణుల జీవితాల్లో ఎలాంటి మార్పుఉండదు. ఎందుకంటే వారి దగ్గర నల్లధనం ఉండదు. అవినీతికి పాల్పడే అవకాశం కూడా వారికి ఉండదు. సమస్య అంతా పట్టణ ప్రాంతాలకే ఉంటుంది’’

‘‘నోట్ల రద్దు తర్వాత హైదరాబాద్ మహానగరం వెలవెలబోతోంది. షాపింగ్ మాల్స్ కొనుగోలుదారులు లేక బోసి పోయాయి. ఐటీ ఉద్యోగులు మినహా మిగిలిన వర్గమంతా లావాదేవీల్ని నగదుతోనే చేస్తూ ఉంటారు. చెలామణిలో ఉన్న కరెన్సీలో 85 శాతం రద్దు కావటంతో ప్రజానీకం ఇప్పుడు కరెన్సీ కొరత ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో అత్యవసరాలకు మినహా ఖర్చు చేయలేని పరిస్థితి’’

‘‘తెలంగాణ ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు హైదరాబాద్ నగరమే. ఇక్కడ వ్యాపారాలు దెబ్బ తింటే దాని ప్రభావం ప్రభుత్వ ఆదాయం పై పడకుండా ఎందుకు ఉంటుంది? రియల్ ఎస్టేట్ రంగం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ రంగంలో లావాదేవీల్లో సగభాగం నగదు రూపంలోనే ఉంటాయి. ఇప్పుడు ఆ నగదే లేకపోవటంతో కొనేవాడే కరువయ్యారు. దీనికి పర్యవసానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలవుతోంది. నిర్మాణ రంగం దెబ్బ తింటే దాని ప్రభావం సిమెంటు పరిశ్రమపై పడుతుంది. అది అంతటితో ఆగదు. నిర్మాణ రంగంపై ఆధారపడి బతికే వారి ఉపాధి కరువవుతుంది. హైదరాబాద్ లో ఎన్నెన్నో బడాబడా మాల్స్ ఏర్పడ్డాయి. వాటిల్లో కొనుగోలు చేసేవారిలో అత్యధికులు నల్లధనంతోనే కొంటుంటారు. చట్టబద్ధమైన సొమ్ముతో కొనుగోళ్లు జరపాలంటే వ్యాపారాలు సగానికి పైగా పడిపోతాయి. ముఖ్యమంత్రి వాపోతున్నట్లుగా వాహనాలు..ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లు దారుణంగా పడిపోతాయి’’

‘‘తెలుగు రాష్ట్రాల విషయమే తీసుకుంటే రెండేళ్ల తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ రెండేళ్లలో ప్రభుత్వాల ఆదాయం పడిపోతే అధికారంలో ఉన్న పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితి. దాని వల్ల వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా నష్టం జరుగుతుంది. బహుశా ఈ కారణం వల్లనే కాబోలు తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నిర్ణయం పట్ల ఎక్కువగా కలత చెందుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్పు రాని పక్షంలో రానున్న నెలల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించటంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి’’

‘‘హైదరాబాద్ ను మినహాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో వచ్చేఆదాయం నామమాత్రమే. తెలంగాణ ధనికరాష్ట్రంగా నిలబడిందంటే హైదరాబాద్ పుణ్యమే. ఈ నగరంలోనే వ్యాపార లావాదేవీలు దెబ్బ తింటే ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం పడుతుంది’’

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/