Begin typing your search above and press return to search.

రియాలిటీతో ప‌నిలేదు!..ఆ ఫిగ‌ర్ కావాలంతే!

By:  Tupaki Desk   |   17 Jun 2018 8:09 AM GMT
రియాలిటీతో ప‌నిలేదు!..ఆ ఫిగ‌ర్ కావాలంతే!
X
ఇప్ప‌టికిప్పుడు ఏపీలో ఎన్నిక‌లు జ‌రిగితే... అధికారంలో ఉన్న టీడీపీకి ఏకంగా 110 సీట్లు వ‌స్తాయ‌ని, మ‌రోమారు రాష్ట్రానికి చంద్ర‌బాబే సీఎం అవుతారంటూ ఆ పార్టీ అనుకూల మీడియాలో నేడు ఓ పెద్ద క‌థ‌న‌మే వ‌చ్చింది. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీకి వ‌చ్చిన సీట్లు 102 మాత్ర‌మే. అయితే అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత త‌న‌దైన శైలిలో పాల‌న సాగిస్తూ... రాష్ట్రాన్ని అభివృద్ధిప‌థాన న‌డిపించే నేత‌కు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డం పెద్ద‌గా కొత్తేమీ కాదు. అయితే రాష్ట్రంలో ప‌రిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్న విష‌యం క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా క‌నిపిస్తోంది. అమరావ‌తి నిర్మాణం ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డే అన్న చందంగా ఉంటే... రాష్ట్రానికి జీవ‌నాడిగా ప‌రిగ‌ణిస్తున్న పోలవ‌రం ప్రాజెక్టుకు సంబంధించిన డెడ్ లైన్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మార్చుకుంటూ ముందుకు సాగుతున్న టీడీపీ అధినేత‌ - రాష్ట్ర సీఎం నారా చంద్ర‌బాబు ప‌ట్ల నానాటికీ వ్య‌తిరేకత పెరుగుతోంద‌న్న విశ్లేష‌ణ‌లు ఇటీవ‌లి కాలంలో మ‌రింత‌గా పెరిగాయి. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాది మాత్ర‌మే స‌మ‌యం ఉంద‌న్న నేప‌థ్యంలో సొంత సంస్థ‌ల‌తో స‌ర్వే చేయించుకున్న చంద్ర‌బాబు... జ‌నంలో పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకోవడ‌మెలాగో తెలియ‌క సొంత పార్టీ నేత‌ల‌పై విరుచుకుప‌డుతున్నార‌న్న గుస‌గుస‌లూ వినిపిస్తున్నాయి.

అదే స‌మ‌యంలో 2019 ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అంత‌కంత‌కూ పెరుగుతున్న మ‌ద్ద‌తు కూడా చంద్ర‌బాబుకు నిద్ర లేని రాత్రుల‌ను మిగులుస్తున్నాయ‌న్న వాద‌నా లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో టీడీపీ అనుకూల మీడియాగా పేరుప‌డ్డ ఓ టీవీ ఛానెల్‌, ప‌త్రిలో తాటికాయ‌లంత అక్ష‌రాల‌తో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే టీడీపీదే అధికార‌మంటూ వండి వార్చేసిన క‌థ‌నం వ‌చ్చేసింది. ఈ క‌థ‌నంలో ఏ మేర వాస్త‌వ‌ముంద‌న్న విష‌యం మొత్తం ఆ వార్త‌ను చ‌దివితే ఇట్టే అర్థం కాక‌మాన‌దు. వాస్త‌వానికి ఆర్జీ ఫ్లాష్ టీం అనేది మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ కు చెందిన సంస్థ. ఇప్ప‌టిదాకా పార్టీలు - నేత‌ల‌తో సంబంధం లేకుండా ల‌గ‌డ‌పాటి ఆ టీంతో స‌ర్వేలు చేయించారు. ఇప్పుడు ల‌గ‌డ‌పాటి ప్ర‌మేయం లేకుండా టీడీపీ అనుకూల మీడియాగా పేరుప‌డ్డ ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఛానెల్‌ - ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక యాజ‌మాన్యం ఆర్జీ ఫ్లాష్ టీంతో స‌ర్వే చేయించుకుంది. ఆంధ్ర‌జ్యోతి యాజామాన్యం స‌ర్వే చేయించుకుంటే... ఆ యాజ‌మాన్యానికి అనుకూలంగా కాకుండా వ్య‌తిరేకంగా ఫ‌లితం ఎలా వ‌స్తుంది? ఇక్క‌డా అదే జ‌రిగింది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో వ‌చ్చిన సీట్ల కంటే కూడా ఇప్పుడు టీడీపీ అద‌నంగా 8 సీట్లు వ‌స్తాయ‌ని - మొత్తంగా 110 సీట్లు ఖాయ‌మంటూ ఆ స‌ర్వే తేల్చేసింది.

ఈ స‌ర్వేలో నిజం ఎంత ఉంద‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే... అస‌లు ఈ స‌ర్వేకు అడుగు ముందుకు ప‌డిన తీరు ఆస‌క్తికరంగా ఉంద‌న్న కోణంలో ప‌లు విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. కృష్ణా - గుంటూరు జిల్లాల్లో క‌మ్మ సామాజిక వ‌ర్గ‌మే అధికం. ఆ రెండు జిల్లాలో ఆ సామాజిక వ‌ర్గంలో ముందు నుంచి టీడీపీకి ఎక్కువ మంది అనుకూలం. ఇపుడు ఆ అనుకూల‌ వ‌ర్గ‌మంతా త‌మ వ‌ర్గానికి చెందిన చంద్ర‌బాబును త‌ప్పించి మిగిలిన వారిని సీఎంగా ఊహించుకోలేర‌ట‌. ఆంధ్ర‌జ్యోతి మాత్ర‌మే స‌ర్వే చేస్తే... అంత‌గా క్రెడిబిలిటీ ఉండ‌ద‌ని భావించిన స‌ద‌రు వ‌ర్గం... ల‌గ‌డ‌పాటికి మంచి పేరు తెచ్చిన ఆర్జీ ఫ్లాష్ టీంతో ఏజే జ‌త‌క‌ట్ట‌డానికి కార‌ణ‌మైంద‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆంధ్ర‌జ్యోతి చెప్పిన మేర‌కు రంగంలోకి దిగిన ఆర్జీ ఫ్లాష్ టీం... బాబుకు అనుకూల‌ క‌మ్మ వ‌ర్గానికి విన‌సొంపుగా ఉండేలా నివేదిక ఇచ్చింద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇక్కడ మ‌రో అంశాన్ని ప్ర‌స్తావించుకోవాలి. అదేంటంటే... కృష్ణా - గుంటూరు జిల్లాల‌కు చెందిన క‌మ్మోళ్లలోని బాబు వ‌ర్గం... వ‌చ్చే ఎన్నికల్లో టీడీపీకి 110 సీట్లు త‌ప్ప‌నిస‌రిగా వ‌స్తాయ‌ని ఘంటాప‌థంగా చెప్పుకుంటున్నార‌ట‌. త‌మ అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో ఈ సంఖ్య ఏమాత్రం త‌గ్గినా కూడా వారు బాగా ఫైరైపోతున్నార‌ట‌. వారిని శాంతింప‌జేయ‌డంతో పాటుగా... వారిని మరింత‌గా ఆనంద డోలిక‌ల్లో తేలియాడేలా చేసేందుకే ఆంధ్ర‌జ్యోతి యాజ‌మాన్యం టీడీపీకి 110 సీట్లు వ‌స్తాయ‌ని ఆర్జీ ఫ్లాష్ టీంతో చెప్పించిన‌ట్లుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నానాటికీ ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను పెంచేసుకుంటూ ముందుకు సాగుతున్న టీడీపీకి 110 సీట్లు వ‌స్తాయ‌ని చెప్పే ధైర్యం ఏ ఒక్కరికి లేకున్నా... తిమ్మిని బ‌మ్మిని చేసే ప్ర‌య‌త్నంలో భాగంగా ... ఆర్జీ ఫ్లాష్ టీంను రంగంలోకి దించేసి ఆ సంఖ్య‌ను చెప్పించేసింద‌ట‌. మ‌రి ఈ సంఖ్య టీడీపీకి ఏ విధంగా వ‌స్తుందో తెలియ‌దు గానీ... మొత్తంగా చూస్తుంటే ఈ త‌ర‌హా స‌ర్వేల‌తో చంద్ర‌బాబు పుట్టి ముంచేందుకు క‌మ్మ సామాజిక వ‌ర్గంలోని ఆయ‌న అనుకూల వ‌ర్గం త‌మ‌కు తెలియ‌కుండానే ఇలాంటి దుస్సాహాసాలు చేస్తోంద‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.