Begin typing your search above and press return to search.

అబార్షన్ల బిల్లుకి పార్లమెంట్ ఆమోదం ..అందులో ఏముందంటే ?

By:  Tupaki Desk   |   18 March 2021 5:30 AM GMT
అబార్షన్ల బిల్లుకి పార్లమెంట్ ఆమోదం ..అందులో ఏముందంటే ?
X
మహిళలకు రాజ్యసభ అతి పెద్ద ఊరటనిచ్చే కీలకమైన బిల్లుపై నిర్ణయం తీసుకుంది. మహిళల అబార్షన్‌ గరిష్ట పరిమితిని 20 వారాల నుంచి 24 వారాలకు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు [Medical Termination of Pregnancy (Amendment) Bill, 2020] గతేడాది మార్చిలోనే ఆమోదం తెలిపింది. తాజాగా పార్లమెంట్‌ ఉభయసభల ఆమోదంతో చట్టం రూపం దాల్చడానికి సిద్ధమైంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మహిళలకు గర్భ విచ్ఛిత్తి కి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. మైనర్ బాలికలు, లైంగిక దాడి బాధితులు, దివ్యాంగులు, అవాంఛిత గర్భం దాల్చిన మహిళలకు ఈ కొత్త చట్టం ద్వారా ఊరట కలుగనుంది. 20 వారాలకు పైబడిన 24 వారాలకు మించని గర్భాలు ఈ ప్రత్యేక కేటగిరీలోకి వస్తాయి.

ఇలాంటి ప్రత్యేక కేటగిరీ కేసులను పరిశీలించేందుకు రాష్ట్రాలు గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్, పీడియాట్రీషియన్, మరొకరితో ప్రత్యేక మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గర్భస్రావం చేసిన వైద్యుడు ఆ మహిళ పేరు, ఇతర వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగంగా ప్రకటించరాదు.

అసలు ఈ చట్టాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే .. 2017లో చంఢీగర్ ‌కు చెందిన పదేళ్ల బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన తర్వాత అబార్షన్ కాలపరిమితిని పెంచాలనే డిమాండ్ ఊపందుకుంది. మేనమామ చేతిలో పలుమార్లు అత్యాచారానికి గురైన ఆ బాలిక తెలిసీ తెలియని వయసులో గర్భం దాల్చింది. బాలిక తల్లిదండ్రులో ఆమెకు అబార్షన్ చేయించడానికి అనుమతి కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. విచారణ పూర్తయ్యే నాటికి ఆమెకు అబార్షన్ చేయాల్సిన సమయం దాటిపోయింది. అలాంటి పరిస్థితుల్లో అబార్షన్ చేస్తే.. బాలిక ప్రాణానికి ప్రమాదమని వైద్యులు చెప్పడంతో ఆ ప్రయత్నాలను మానుకున్నారు. అనంతరం ఆ బాలికను డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. 2017 ఆగస్టులో ఆ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అనంతరం గర్భ విచ్ఛిత్తి గడువును పెంచాలనే డిమాండ్ ఊపందుకుంది. ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసిన తర్వాత ఈ కొత్త చట్టానికి రూపకల్పన చేసినట్లు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఈ కొత్త చట్టం మహిళల గౌరవాన్ని కాపాడేదిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.