Begin typing your search above and press return to search.

మోడీ అండ్ కోకి స‌ర్వే వార్నింగ్ బెల్స్!

By:  Tupaki Desk   |   14 Aug 2018 5:57 AM GMT
మోడీ అండ్ కోకి స‌ర్వే వార్నింగ్ బెల్స్!
X
ఇప్పుడు వ‌చ్చిన సీట్లేంది? అంత‌కు మించిన సీట్ల‌తో ఇర‌గ‌దీస్తామంటూ ప్ర‌ధాని మోడీ అదే ప‌నిగా 2019 ఎన్నిక‌ల ఫ‌లితాల మీద వ్యాఖ్యానిస్తున్న వైనం తెలిసిందే. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలుపు ధీమాను ప్ర‌ద‌ర్శిస్తున్న ఆయ‌న‌కు.. ఆయ‌న ప‌రివారానికి నోటి మాట రాకుండా చేయ‌ట‌మే కాదు.. నిద్ర ప‌ట్ట‌ని రీతిలో తాజాగా ఒక స‌ర్వే ఫ‌లితం విడుద‌లైంది.

ఈ ఏడాది చివ‌ర్లో జ‌రుగుతాయ‌ని భావిస్తున్న మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌మ‌ల‌నాథుల కొంప మునిగేలా ఫ‌లితాలు రావ‌టం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేస్తూ.. తాజాగా ఒక స‌ర్వే విడుద‌లైంది. మూడు కీల‌క రాష్ట్రాలుగా.. బీజేపీకి అండ‌గా ఉన్న హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో బీజేపీకి ఈసారి ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేస్తూ ఏబీపీ-సీ ఓట‌ర్ జ‌రిపిన స‌ర్వే ఒక‌టి స్ప‌ష్టం చేసింది.

రాజ‌స్థాన్ లో 200 అసెంబ్లీ స్థానాల‌కు 130 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. అదే రీతిలో 230 సీట్లు ఉన్న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోనూ 117 స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకుంటుంద‌న్న విష‌యాన్ని తాజా స‌ర్వే వెల్ల‌డించింది. ఇక‌.. 90 స్థానాలున్న ఛ‌త్తీస్ గ‌ఢ్ లోనూ 54 సీట్లు సొంతం చేసుకొని కాంగ్రెస్ ప‌వ‌ర్లోకి రావ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

తాజాగా వెలుడిన స‌ర్వేలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ మిన‌హా మిగిలిన రెండు రాష్ట్రాల్లో ఓట‌మి ప‌క్కా అని తేలుస్తున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోనూ విజ‌యం సాధించే ప‌రిస్థితి లేద‌ని.. కాకుంటే మిగిలిన రెండు రాష్ట్రాలతో పోలిస్తే.. సీట్లు కాసింత మెరుగ్గా వ‌చ్చే వీలుంద‌ని స‌ర్వే జోస్యం చెప్పింది. ఇదే గ్రూపు నాలుగు నెల‌ల కింద‌ట జ‌రిపిన స‌ర్వేలో బీజేపీ భారీగా సీట్లు కోల్పోనుంద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మిపాలైనా.. 2019లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మాత్రం ఈ రాష్ట్రాల్లో బీజేపీకే ఎక్కువ ఎంపీ సీట్లు రానున్న‌ట్లుగా వెల్ల‌డించింది. ప్ర‌ధానిగా ఎవ‌రు అర్హుల‌న్న ప్ర‌శ్న‌కు 53.8 శాతం మంది మోడీ పేరును చెబితే.. 46.2 శాతం మంది రాహుల్ పేరును చెప్పార‌ని స‌ర్వే వివ‌రాల్ని వెల్ల‌డించారు.

తాజాగా విడుద‌లైన స‌ర్వే ఫ‌లితాలు నిజ‌మైతే.. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. రాహుల్ కు స‌రికొత్త శ‌క్తిని ఇస్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అదే స‌మ‌యంలో గెలుపు ధీమాను వ్య‌క్తం చేసే మోడీ ప‌రివారానికి ఈ మూడు రాష్ట్రాల ఫ‌లితాలు శ‌రాఘాతంగా మార‌తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.