Begin typing your search above and press return to search.

అంతా పెద్ద మనుషులే... జగన్ మాటేంటో... ?

By:  Tupaki Desk   |   8 Oct 2021 4:50 AM GMT
అంతా పెద్ద మనుషులే... జగన్ మాటేంటో... ?
X
ఏపీలో సంపూర్ణ అధికారం వైసీపీ చేతిలో ఉంది. పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుడి దాకా అందరూ ఫ్యాన్ పార్టీకి చెందిన వారే. ఇంతలా రాజకీయ అధిపత్యం చలాయించిన పార్టీ ఏపీ చరిత్రలోనే కాదు, బహుశా దేశ చరిత్రలో కూడా లేదేమో. భవిష్యత్తులో ఈ రికార్డుని బధ్ధలు కొట్టడం కూడా ఎవరి వల్లా కాదేమో. సో ఆ విధంగా చూస్తే జగన్ గ్రేట్ అనాలి. సరే పదవులు అన్నీ వైసీపీ నేతలవే. అందలాలు అన్నీ దక్కినా కూడా ఇంకా చాలా మంది నేతలు మిగిలారు. తమకు అధికార వాటా ఏదీ అంటూ చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న వారు వైసీపీలో ఎక్కువ మిక్కిలిగానే ఉన్నారు. త్వరలో ఏపీలోని పెద్దల సభలో 14 ఎమ్మెల్సీ సీట్లు భర్తి కాబోతున్నాయి. ఇవన్నీ కూడా ఒక్క వైసీపీయే గెలుచుకోవడం విశేషం. అదే సమయంలో ఇంతకాలం శాసనమండలిలో ఆధిపత్యాన్ని చేసిన టీడీపీ పూర్తిగా మైనారిటీలో పడిపోతోంది. అంటే పసుపు రెపరెపలు మండలిలో బాగా తగ్గిపోతాయన్న మాట.

ఆ మేరకు పూర్తి మెజారిటీ సాధించి పెద్దల సభలో బల్లగుద్దీ మరీ మేమే ఆడా ఈడా అంటూ వైసీపీ గర్జించబోతోంది. సరే ఈ పద్నాలుగు సీట్లలో ఎవరికి అవకాశం ఉంది, ఎవరిని ఎంపిక చేస్తారు అన్నదే చర్చగా ఉంది. వైసీపీలో ఎమ్మెల్సీ పోస్ట్ మీద ఆశ పెట్టుకుని చాలా మందే ఉన్నారు. ఉత్తరాంధ్రా జిల్లాల విషయానికి వస్తే విశాఖ నుంచి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఆయన ఉమ్మడి ఏపీలో శాసన‌మండలి రెండవ సారి ఏర్పాటు అయ్యాక కౌన్సిల్ లో తొలి విపక్ష నేతగా వ్యవహరించారు. ఆ తరువాత ఆయన సభత్వం రెన్యూవల్ చేయకపోవడంతో టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చేశారు. జగన్ ఆయనను పెద్దల సభకు పంపుతారా లేదా అన్నదే ఇక్కడ చర్చగా ఉంది.

అలాగే విశాఖ మేయర్ పదవికి హామీ ఇచ్చిన వైసీపీ హై కమాండ్ చివరి నిముషంలో వంశీక్రిష్ణ శ్రీనివాస్ ని పక్కన పెట్టి మహిళా కోటాలో గొలగాని హరి వెంకట కుమారిని ఎంపిక చేసింది. దాంతో అలిగిన వంశీకి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పారు. దాంతో ఆయన చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా ఉన్న వంశీకి ఈసారి సీటు తప్పదని అంటున్నారు. ఇక మైనారిటీ కోటాలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన డాక్టర్ ఎస్ ఎ రహమాన్ ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి తీసుకుంటే మహిళా నేత వరుడు కళ్యాణి తనకే ఎమ్మెల్సీ అని ధీమాగా ఉన్నారు. ఆమె బీసీ సామాజికవర్గానికి చెందిన కీలక నేత.

ఇక కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన కిల్లి కృపారాణికి రాజ్యసభ సీటు ఇవ్వలేకపోవచ్చు అంటున్నారు. దాంతో ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవిస్తారని చెబుతున్నారు. ఇదే జిల్లాలో పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు ఎమ్మెల్సీ ఇస్తే చాలు అనుకుంటున్నారు. విజయనగరం జిల్లాలో కూడా ఎమ్మెల్యే టికెట్ రాని వారు అనేకులు పెద్ద మనుషులు అవాలనుకుంటున్నారు. మరి జగన్ మనసులో ఏముందో, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో చూడాలి. ఏది ఏమైనా వైసీపీలో అంతా పెద్ద మనుషులే కనిపిస్తున్నారు. చూడాలి మరి శాసన మండలిలో కాలు పెట్టేది ఎవరో, ఆ లక్కుని తొక్కేది ఎవరో.