Begin typing your search above and press return to search.

మోడీ పరువు తీసిన ఏబీవీపీ

By:  Tupaki Desk   |   5 Nov 2017 4:23 PM GMT
మోడీ పరువు తీసిన ఏబీవీపీ
X
ప్ర‌ధాని మోడీ ఊహించని షాక్ తగిలింది. బీజేపీ అనుబంధ విద్యార్థి సంస్థ ఏబీవీపీ ప్ర‌ధాని నియోజ‌క‌వ‌ర్గ‌ం వార‌ణాసిలోని కాశీ విద్యాపీఠ్ విద్యార్ధి ఎన్నిక‌ల్లో దారుణంగా ఓడిపోయింది. ఒక స్వతంత్ర అభ్య‌ర్ధి రాహుల్ దుబే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో అక్కడ విజయం సాధించడం విశేషం. ఓటమిపాలైన ఏబీవీపీ నాయ‌కుడు వాల్మీకి ఉపాధ్య‌య‌ త‌న అనుచ‌రుల‌తో క‌లిసి గెలిచిన అభ్య‌ర్ధిపై దాడికి దిగడం వివాదాస్పదమైంది.

మరోవైపు కొత్త‌గా ఎన్నికైన అధ్య‌క్షుడు రాహుల్ దుబేకు విద్యార్థుల నుంచి మద్దతు లభించడంతో ఏబీవీపీ నేతలు ఏమేం చేయలేకపోయారు. నిజానికి రాహుల్ ఇక్కడ సమాజ్ వాది పార్టీ మద్దతు కోరినా ఆ పార్టీ అందుకు నిరాకరించింది. దీంతో ఆయన స్వతంత్రంగానే పోటీకి దిగాడు. కాంగ్రెస్‌, సమాజ్‌ వాది పార్టీల విద్యార్థి విభాగాలు కూడా ఇక్కడ మంచి ఫలితాలే సాధించాయి.

కాగా ఈ ఏడాదిలో చాలా యూనివ‌ర్సీటీల్లో జ‌రిగిన విద్యార్ధి ఎన్నిక‌ల్లో ఎబివిపి ఘోరంగా ఓట‌మి పాల‌యింది. ఈ జాబితాలో వార‌ణాసి తాజాగా చేరింది. బిజెపికి ఎంతో ప‌ట్టున్న వార‌ణాసిలో ఇలా ఓట‌మి చెందడంతో బీజేపీ నాయకులు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో పడ్డారు. ఇప్పటికే ఢిల్లీ, రాజస్థాన్, వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ‌, హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీల్లో కూడా ఏబీవీపీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనూ అలయెన్స్ ఫర్ సోషల్ జస్టిస్ ఎన్నికల్లో విజయం సాధించింది. మొత్తానికి దేశవ్యాప్తంగా ఏబీవీపీ ప్రతి చోటా పరాజయాలే మూటగట్టుకుంటోంది.